నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్​ఫోర్స్​

నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్​ఫోర్స్​
  •     ఆయా శాఖల సమన్వయ సమావేశాల్లో కలెక్టర్లు

జనగామ అర్బన్, వెలుగు :  నకిలీ  విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని  కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​  హెచ్చరించారు. గురువారం  కలెక్టరేట్​లోని కాన్ఫరెన్సు  హాల్లో డీసీపీ సీతారాం, ఏసీపీ అంకిత్​ కుమర్​ శంఖ్వార్​  తో కలిసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో వ్యవసాయ  , పోలీస్​ , రెవెన్యూ  అధికారులు,  విత్తన, ఎరువుల డీలర్లు సమన్వయంతో పనిచేయాలని..  నకిలీ, కల్తీ విత్తనాల సరఫరా జరగకుండా  చర్యలు చేపట్టాలని సూచించారు.

విత్తనాల విషయంలో రైతులకు  సందేహాలు ఉంటే వెంటనే 9398616041  టోల్​ఫ్రీ నంబర్​ ద్వారా వ్యవసాయాధికారులను సంప్రదించాలని కోరారు. గ్రామ స్థాయిలో రైతులకు నాణ్యమైన విత్తనాల కొనుగోలుపై రైతు వేదికల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.  నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణాల యజమానులపై  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులతో టాస్క్​ఫోర్స్​ బృందాలను ఏర్పాటు చేయాలని విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు.  అనంతరం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు విక్రయిస్తామని అధికారులు, డీలర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఏవో వినోద్​ కుమార్, విత్తనాల అసోసియేషన్​ ప్రెసిడెంట్​ బజ్జూరి గోపయ్య, ఏడీఏలు, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, డీలర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

రైతులను మోసం చేస్తే చర్యలు : 

హనుమకొండ :  రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు అంటగడితే చట్టప్రకారం సీరియస్​యాక్షన్​తీసుకుంటామని హనుమకొండ  కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ హెచ్చరించారు.  పంటల సీజన్ కావడంతో పత్తి, మిర్చీ  నకిలీ విత్తనాలు ఎక్కువగా అమ్ముతుంటారని, నకిలీల నియంత్రణకు జిల్లా స్థాయిలో టాస్క్​ ఫోర్స్​ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. హనుమకొండ కలెక్టరేట్​ లోని కాన్ఫరెన్స్​ హాలులో వ్యవసాయ, పోలీస్​ శాఖ అధికారులు, విత్తన వ్యాపారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.  జిల్లా లో  టాస్క్​ ఫోర్స్​ కమిటీ విస్తృత తనిఖీలు నిర్వహిస్తుందని, నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్ వెంకట్ రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ, వ్యవసాయశాఖ జేడీ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.