షేర్ మార్కెట్ పేరిట రూ.2.11 కోట్లు వసూలు.. నిందితుడి అరెస్ట్​

షేర్ మార్కెట్ పేరిట రూ.2.11 కోట్లు వసూలు.. నిందితుడి అరెస్ట్​

మంచిర్యాల/గోదావరిఖని, వెలుగు: షేర్​ మార్కెట్​ పేరిట పలువురి దగ్గర రూ.2.11 కోట్లు వసూలు చేసి ఐదు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని టాస్క్​ఫోర్స్​పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రామగుండం పోలీస్​కమిషనర్​ రెమా రాజేశ్వరి కథనం ప్రకారం..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోసేవా మండల్​రోడ్​కు చెందిన చెవ్వా రవి(43) డీటీపీ వర్క్​చేసేవాడు. సులువుగా డబ్బు సంపాదించాలని షేర్​మార్కెట్​బిజినెస్​ పేరిట మోసాలకు తెరదీశాడు. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే తక్కువ టైమ్​లో ఎక్కువ లాభం వస్తుందని, రోజువారీగా, వారం, నెల వారీగా డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పాడు. తనకు తెలిసిన 50 మంది దగ్గర నుంచి సుమారు రూ.2.11 కోట్లు వసూలు చేశాడు.

ఇందులో  కొంత మొత్తం షేర్ మార్కెట్ లో పెట్టగా నష్టం వచ్చింది. మిగిలిన మొత్తాన్ని తన సొంతానికి వాడుకున్నాడు. దీనిపై బాధితులు  ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈక్రమంలో రవి మంగళవారం హైదరాబాద్​నుంచి మంచిర్యాలకు వస్తున్నాడనే సమాచారంతో స్థానిక రైల్వే ఓవర్​ బ్రిడ్జి ప్రాంతంలో టాస్క్​​ఫోర్స్​, టౌన్​ పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. నిందితుడి దగ్గరి నుంచి క్రెడిట్​కార్డులు, బ్యాంక్​పాస్​బుక్స్​, రూ.8వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు సుధాకర్, అశోక్, ఎస్సైలు ప్రసాద్, లచ్చన్న పాల్గొన్నారు.