
న్యూఢిల్లీ: ఇప్పట్లో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ఆలోచన లేదని టీసీఎస్ ప్రకటించింది. ఉపాధి కోల్పోయిన స్టార్టప్ ఉద్యోగులను కూడా నియమించుకుంటామని సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద టెక్ కంపెనీలు సహా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ సంగతి చెప్పారు. తమ కంపెనీలో లేఆఫ్‌లు ఉండబోవని, కంపెనీలో ప్రతిభను పెంచుకోవడాన్ని ఎంకరేజ్ చేస్తామని అన్నారు. చాలా కంపెనీల వద్ద అవసరానికి మించి ఎంప్లాయీస్ ఉండటంతో లేఆఫ్‌లు ప్రకటించాల్సి వస్తోందని లక్కడ్ వివరించారు. అవసరమైన నైపుణ్యాలు లేని ఉద్యోగులను గుర్తించి వాటిని నేర్పిస్తామన్నారు. ప్రస్తుతం టీసీఎస్‌లో 6 లక్షల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు.