తలకిందులైన TCS లాభాలు.. క్యూ1 ఫలితాలపై AI ఎఫెక్ట్ పడిందా?

తలకిందులైన TCS లాభాలు.. క్యూ1 ఫలితాలపై AI ఎఫెక్ట్ పడిందా?

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ 2026-27 ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం మార్కెట్ అంచనాలను స్వల్పంగా నిరాశపరిచింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టీసీఎస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.13వేల 349 కోట్లుగా నమోదైంది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 2.7 శాతం తగ్గింది. మార్కెట్ విశ్లేషకులు రూ.13వేల 461 కోట్ల లాభాన్ని అంచనా వేయగా.. కంపెనీ ఫలితాలు ఆ స్థాయిని అందుకోలేకపోయాయి.

అయితే ఆదాయం విషయంలో టీసీఎస్ అంచనాలను మించి ప్రదర్శన చూపగలిగింది. తొలి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.72వేల 275 కోట్లకు చేరుకుంది. విశ్లేషకుల అంచనా రూ.71వేల 847 కోట్లను దాటేసింది. అసాధారణ అంశాలను మినహాయిస్తే కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 8.5 శాతం పెరిగి రూ.13వేల 849 కోట్లకు చేరగా, ఆదాయం కూడా 13.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో షేర్‌హోల్డర్లకు టీసీఎస్ శుభవార్త కూడా చెప్పింది. ప్రతి ఈక్విటీ షేర్‌కు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. జూలై 15ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించగా, జూలై 31న డివిడెండ్ చెల్లించనుంది.

ఇక ఏఐ సేవల రంగంలో టీసీఎస్ దూకుడు కొనసాగుతోంది. ఏడాది ప్రాతిపదికన AI ఆదాయం 2.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో SKFతో 800 మిలియన్ డాలర్ల విలువైన AI ఆధారిత గ్లోబల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఒప్పందంతో పాటు పలు కీలక భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. మొత్తం కాంట్రాక్ట్ విలువ 9.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కంపెనీ వృద్ధిని కొనసాగించగలిగిందని టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ తెలిపారు. త్రైమాసికం ముగిసే నాటికి కంపెనీలో మొత్తం 5లక్షల 93వేల 798 మంది ఉద్యోగులు ఉండగా.. గత 12 నెలల అట్రిషన్ రేటు 13.6 శాతంగా నమోదైంది. లాభం అంచనాలను అందుకోలేకపోయినా.. బలమైన ఆదాయం, AI వ్యాపార విస్తరణ, భారీ ఒప్పందాలు టీసీఎస్‌కు సానుకూల సంకేతాలుగా కనిపిస్తున్నాయి.