ఏఐ ఎఫెక్ట్.. 12 వేల మందిని తొలగించనున్న టీసీఎస్‌‌

ఏఐ ఎఫెక్ట్.. 12 వేల మందిని  తొలగించనున్న టీసీఎస్‌‌

 

  • మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగులను తొలగిస్తామన్న సీఈఓ
  • బలమైన భవిష్యత్తు కోసమే ఈ కఠిన నిర్ణయమని వ్యాఖ్య
  • సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఇది 2 శాతానికి సమానం
  • ప్రస్తుతం టీసీఎస్​లో 6,13,069 మంది  ఉద్యోగులు
  • 25 వేల మందిని తొలగిస్తామని ఇటీవల ఇంటెల్ ప్రకటన

న్యూఢిల్లీ:  భారతదేశ  అతిపెద్ద ఐటీ కంపెనీ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌‌‌‌) గ్లోబల్‌‌‌‌గా  సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కి మారుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది.  ఈ ఏడాది తమ గ్లోబల్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో 2శాతం లేదా సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తున్నామని టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్   ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. " ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు రెడీ అవుతున్నాం.  ఇందులో భాగంగా కొంతమంది ఉద్యోగులను తీసేయక తప్పడం లేదు.  గ్లోబల్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో 2 శాతం మంది ఉద్యోగులను, ముఖ్యంగా మిడిల్, సీనియర్ గ్రేడ్‌‌‌‌ల ఉద్యోగులను తొలగిస్తాం" అని  ఆయన పేర్కొన్నారు.  ఉద్యోగుల కోత ప్రభావం క్లయింట్లకు అందించే  సర్వీస్‌‌‌‌లపై పడదని తెలిపారు. కాగా,   జాబ్‌‌‌‌ కోల్పోయిన వారికి  నోటీసు పీరియడ్ చెల్లింపులతో పాటు అదనపు సెవరెన్స్ ప్యాకేజీ, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, అవుట్‌‌‌‌ప్లేస్‌‌‌‌మెంట్ అవకాశాలను టీసీఎస్ అందించనుంది.  ఇటీవల  ఎంప్లాయీ బెంచ్ పాలసీని కంపెనీ సవరించింది. దీనిపై చాలా  ఫిర్యాదులు వచ్చాయి. ఈ పాలసీ ప్రకటన తర్వాత ఉద్యోగుల కోతను  ప్రకటించింది.  

కాగా, ఇండియాలోని టాప్ ఆరు ఐటీ సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్-–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  కేవలం 3,847 మందిని మాత్రమే నియమించుకున్నాయి.  ఇది ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో నియమించుకున్న  13,935 మందితో  పోలిస్తే  ఏకంగా 72శాతం తక్కువ. టీసీఎస్‌‌‌‌  కొత్త టెక్ రంగాల్లో పెట్టుబడి పెడుతోంది.  కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, ఏఐ వాడకాన్ని పెంచడం,  నెక్స్ట్-జనరేషన్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేయడం,  వర్క్‌‌‌‌ఫోర్స్ మోడల్‌‌‌‌ను మెరుగుపరచడం వంటివి చేపడుతోంది. ఈ కోతలు మార్జిన్‌‌‌‌లను పెంచుకోవడానికి కాదని, భవిష్యత్ కోసం రెడీగా ఉండడానికని కృతివాసన్ హైలైట్ చేశారు. ఉద్యోగుల కోత ఏ ఒక్క ప్రాంతానికి పరిమితమై ఉండదని తెలిపారు.  సీఈఓగా ఇది కఠినమైన నిర్ణయమని కృతివాసన్ అంగీకరించారు. కానీ  బలమైన భవిష్యత్తు కోసం ఇది అవసరమని పేర్కొన్నారు. ఏఐ వాడకాన్ని పెంచడంతో 25 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని తాజాగా ఇంటెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ కూడా సుమారు 15 వేల మందిని తీసేసింది.