పొత్తు కుదిరితే బీజేపీ కండీషన్స్ ఇవే?..

పొత్తు కుదిరితే బీజేపీ కండీషన్స్ ఇవే?..

 ఎన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీజేపీ(BJP) అధినాయకత్వం కరుణించింది. కనికరించింది. పొత్తుకు రమ్మని పిలిచింది. వస్తే సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకుందామని చెప్పింది. ఈ పిలుపు కోసం నిరీక్షిస్తున్న చంద్రబాబు ఢిల్లీకి(Delhi) వెళ్లారు.  పొత్తులో భాగంగా బీజేపీ ఆరు నుంచి పది లోక్‌సభ స్థానాలు(Lok sabha) , 25 ఎమ్మెల్యేలు స్థానాలు అడిగిందని సమాచారం అందుతోంది. 

ఏపీ ఎన్నికల్లో టీడీపీ... జనసేన మధ్య పొత్తు కుదిరితే  సీట్ల విషయంలో అమిత్ షా.. చంద్రబాబు  మధ్య  కీలకచర్చలు జరగనున్నాయి.  ఇప్పటికే ఏపీ బీజేపీ నేత కంభంపాటి  రామ్మోహనరావుతో... అమిత్ షా చర్చించారు.  పొత్తులో భాగంగా  బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు... 25 అసెంబ్లీ ఇవ్వాలని బీజేపీ కోరుతుందని సమాచారం అందుతోంది.  అయితే మూడు ఎంపీ సీట్లు... 5 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 

ఈరోజు( ఫిబ్రవరి 7)  చంద్రబాబు అమిత్ షా మధ్య జరిగే చర్చల్లో పొత్తు విషయంతో పాటు సీట్ల పంపకాల విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ప్రతిపాదనలో ... అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపూర్‌ పార్లమెంటు స్థానాలున్నాయి. గతంలో గెలిచిన స్థానాలనే బీజేపీ ఎక్కువగా పట్టుబట్టే అవకాశం ఉంది.  పొత్తు కుదిరితే  మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం, సీట్ల సర్దుబాటు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిపాయి. కమిటీలో బీజేపీ నుంచి జాతీయ స్థాయి నేతలు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.