చంద్రబాబుకు భారీ షాక్ : ముందస్తు బెయిల్ పిటీషన్లు అన్నీ డిస్మిస్

చంద్రబాబుకు భారీ షాక్ : ముందస్తు బెయిల్ పిటీషన్లు అన్నీ డిస్మిస్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు కేసుల్లోకు సంబంధించి.. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్లను డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ పిటీషన్లపై 2023, అక్టోబర్ 9వ తేదీ విచారణ చేసిన న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఏపీ ఫైబర్ గ్రిడ్ లో అవినీతి కేసు, చిత్తూరు జిల్లా అంగళ్లలో విధ్వంసంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసుల్లో ఇప్పటికే ముద్దాయిగా ఉన్నారు చంద్రబాబు. ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేశారు పోలీసులు. ఈ మూడు కేసుల్లో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు ఆశ్రయించారు చంద్రబాబు. అక్కడ ఆయనకు ఊరట లభించలేదు.

ఈ మూడు కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేయటానికి ఇప్పటికే ఏపీ సీఐడీ పీటీ వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. హైకోర్టు నిర్ణయం చంద్రబాబుకు వ్యతిరేకంగా రావటంతో.. ఇప్పుడు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ మూడు కేసుల్లో అరెస్ట్ ఖాయం అయితే మాత్రం.. ఓ కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో అరెస్ట్ అవుతారు.. దీంతో వెంటనే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవనేది న్యాయ నిపుణులు అంచనా.