ఏపీ మంత్రిపై టీడీపీ ఫిర్యాదులు..చంద్రబాబుపై కేసుకు కౌంటర్

ఏపీ మంత్రిపై టీడీపీ ఫిర్యాదులు..చంద్రబాబుపై కేసుకు కౌంటర్

కర్నూలు: ఏపీ పశు సంవర్ధకశాఖ మంత్రి  అప్పలరాజుపై కేసు నమోదు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో N440K  వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పడం  వల్ల సామాన్య ప్రజలు భయాందోళన కు గురిఅవుతున్నారని,  తక్షణమే మంత్రి పై FIR నమోదు చేయాలనే డిమాండ్ తో లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో న్యాయవాది జయన్న ఫిర్యాదు చేయగా కర్నూలు నగరంలో పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధరూర్ జేమ్స్, పార్టీ కార్యదర్శి పోతురాజు రవికుమార్ లు మంత్రిపై చర్య తీసుకోవాలంటూ  కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. 
చంద్రబాబు, లోకేష్ లపై కేసులకు కౌంటర్ గా
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోకి కరోనా ప్రమాదకర వేరియంట్ N440K ప్రవేశించిందని.. సీసీఎంబీ కూడా నిర్ధారించినట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మద్దతుదారుడైన న్యాయవాది చేసిన ఫిర్యాదు ను పరిశీలించి సీఆర్పీసీ నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.  హైదరాబాద్ లో చంద్రబాబుకు  సిఆర్ పిసి నోటిసు ఇవ్వడానికి  దర్యాప్తు అధికారిగా కర్నూలు ఒకటవ పట్టణ సిఐ  హైదరాబాదు కు వెళుతున్నట్లు  జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప వెల్లడించారు.కరోనా N440K వేరియంట్ ప్రమాదకరమని విమర్శించడం.. భయభ్రాంతులకు గురిచేయడం రెండూ వేరు వేరని.. సీసీఎంబీ కూడా అంత పెద్ద ప్రమాదకరం కాదని నిర్ధారించిందని, ఈ నేపధ్యంలో ఎవరైనా కరోనాకు సంబంధించి సోషల్ మిడియాలో  వదంతులు, అసత్యప్రచారాలు  చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు.

అలాగే అనంతపురం జిల్లా డి.హీరేలాల్ లో  పోలీసు స్టేషన్ లో వైసీపీ మద్దతుదారుల ఫిర్యాదుతో నారా లోకేష్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా టీడీపీ నాయకులు కూడా వైసీపీ నేతలపై కేసులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓ వైపు చంద్రబాబుకు నోటీసులిచ్చేలోపే మరింత మంది టీడీపీ నాయకులతో ఫిర్యాదులు చేయించి కేసు నమోదుకు పట్టుపట్టే దిశలో టీడీపీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.