
ఏపీలోని అనంతపురం జిల్లాలో బెల్ట్ షాపు కోసం గొడవపడ్డారు టీడీపీ నేతలు. కొడవళ్లు, ఇనుప రాడ్లు, మారణాయుధాలతో ఇరువర్గాలు దాడులకు దిగారు. అనంతపురం జిల్లాలోని కుందుర్పి మండలం ఎల్లచింత గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఎల్లచింత గ్రామంలో వడ్డే తిమ్మప్ప అనే టీడీపీ ఏడాదిగా బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి మరో టీడీపీ నేత పోటీగా మరో బెల్టు షాపు ప్రారంభించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మద్యం వ్యాపారంలో ఆధిపత్యం కోసం ఇద్దరు టీడీపీ నేతల మధ్య మొదలైన గొడవ పరస్పర దాడులకు దారి తీసింది. ఇరువర్గాల వారు కొడవళ్లు, ఇనుప రాడ్లు, మారణాయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బెల్టు షాపు కోసం టీడీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఏపీలో బెల్ట్ షాపు కోసం టీడీపీ నేతల గొడవ.. కొడవళ్లు, ఇనుప రాడ్లతో పరస్పర దాడులు.. pic.twitter.com/vBh3b8shUV
— Manohar Reddy (@ManoharRed18542) August 6, 2025
ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలవారిని హెచ్చరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్రామంలో బెల్ట్ షాపు వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నామని.. ఇలాంటి గొడవలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.