వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని..

వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని..
  • సిటీ పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్: ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు నారాలోకేష్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్న్స, జివిజే నాయుడు, దుర్గ ప్రసాద్ తదితరులు డీసీపీ కార్యాలయానికి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
దివంగత ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉమా మహేశ్వరి మరణానికి చంద్రబాబు, లోకేష్ కారణం అంటూ విజయ సాయి, దేవేందర్ రెడ్డి తదితరులు ట్వీట్లు చేశారని ఆరోపించారు. ఎంపీ విజయ్ సాయి రెడ్డితో పాటు ఏపి  ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గుర్రంపాటి పై కూడా చర్యలు తీసుకోవాలని డీసీపీకి చేసిన ఫిర్యాదులో కోరారు.