
బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి తీరు వివాదానికి దారితీసింది. బనగానపల్లెలో డ్యూటీలో ఉన్న జశ్వంత్ అనే కానిస్టేబుల్పై మంత్రి సోదరుడు చేయి చేసుకున్నాడు. మంత్రి సోదరుడు కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారంలో ఉన్నామనే అహంతో ఇలా ప్రవర్తించిన మంత్రి సోదరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ వీడియో చూసిన నెటిజన్లు డిమాండ్ చేశారు.
కొట్టి తిట్టి ఆ కానిస్టేబుల్తో మంత్రి సోదరుడు ప్రవర్తించిన తీరు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. హోం మంత్రి అనిత మంత్రి సోదరుడి తీరు పట్ల ఎలా స్పందిస్తారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. అసలు మంత్రి సోదరుడికి, ఆ కానిస్టేబుల్ కు మధ్య ఏం జరిగిందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
స్వామి వారి దర్శనానికి లోపలికి పంపించాలని మదన భూపాల్ రెడ్డి సదరు కానిస్టేబుల్తో వాదనకు దిగాడు. ఆలయంలో భక్తులు ఎక్కువగా ఉండటంతో భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతం లోపలికి అనుమతించడం కుదరదని కానిస్టేబుల్ జశ్వంత్ ఉన్న విషయం మదన భూపాల్ రెడ్డికి వివరించాడు.
అయినా సరే.. కానిస్టేబుల్ చెప్పిన విషయాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా అతనిని నోటికొచ్చినట్లు తిడుతూ.. బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడినని, తనను ఆపడం ఏంటని కోపంతో ఊగిపోతూ కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించాడు. అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో విషయం బయటికొచ్చింది. కానిస్టేబుల్ జశ్వంత్ తనపై జరిగిన దాడికి నిరసన తెలిపాడు. మదన భూపాల్ రెడ్డికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
నంద్యాల జిల్లా బనగానపల్లె పరిధిలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన టీడీపీ మంత్రి బీసీ జనార్ధన్ సోదరుడు pic.twitter.com/NHTvCS3nA7
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) July 31, 2025