పాఠాలు చెబుతూ.. టీచర్ గుండెపోటుతో మృతి

పాఠాలు చెబుతూ.. టీచర్ గుండెపోటుతో మృతి

సడెన్ డెత్స్.. కార్డియాక్ అరెస్టులు పెరిగిపోయాయి. అప్పటి వరకు నిక్షేపంగా ఉన్న వ్యక్తులు.. క్షణాల్లో విగతజీవులుగా మారుతున్నారు. మార్చి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. బాపట్ల జిల్లా చీరాల మండలం వాకావారిపాలెంలో జరిగిన ఘటన షాక్ కు గురి చేసింది. ఉదయం యథావిథిగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన టీచర్ వీరబాబు.. క్లాసు రూంలో పిల్లలకు పాఠాలు చెబుతూ.. కుర్చీలో అలాగే ప్రాణాలు వదిలాడు. పాఠాలు చెబుతున్న మాస్టారు.. ఒక్కసారిగా కుర్చీలోనే  కూలడటంతో పిల్లలకు అర్థం కాక కేకలు వేశారు. 

పక్క గదుల్లో క్లాసులు చెబుతున్న మిగతా ఉపాధ్యాయులు ఏం జరిగిందో తెలుసుకోవటానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే టీచర్ వీరబాబు కుర్చీలో కూలబడి ఉండటాన్ని గమనించి 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గ్రామంలో డాక్టర్ ను పిలిపించారు. అతను వచ్చి పరీక్ష చేయగా.. అప్పటికే చనిపోయినట్లు స్పష్టం చేశారు. దీంతో తోటి ఉపాధ్యాయులు టీచర్ వీరబాబును అంబులెన్స్ లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మార్చి 3వ తేదీ మధ్యాహ్నం నుంచి మార్చి 4వ తేదీ మధ్యాహ్నం వరకు.. అంటే 24 గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు వ్యక్తులు గుండెపోటుతో చనిపోవటం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో 18 ఏళ్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ నడుస్తూ నడుస్తూ చనిపోయాడు.. పెద్దపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన అపార్ట్ మెంట్ లిఫ్ట్ దగ్గర కుప్పకూలి చనిపోయాడు.. ఇప్పుడు చీరాల మండలంలోని వాకావారిపాలెంలో ప్రభుత్వ టీచర్ పాఠాలు చెబుతూ చనిపోయాడు.. ఈ ఘటనలతో జనంలో ఆందోళనలు నెలకొన్నాయి. గట్టి గుండెలు సడెన్ గా ఆగిపోవటంపై ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.