పిల్లలకు పాఠం చెబుతూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

పిల్లలకు పాఠం చెబుతూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
  • పశ్చిమ గోదావరి జిల్లా పట్టెంపాలెం ఎంపీపీ పాఠశాలలో ఘటన

తాడేపల్లిగూడెం: తరగతి గదిలో పిల్లలకు పాఠం చెబుతూ గుండెపోటుతో కుప్పకూలి ఉపాధ్యాయుడు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా పట్టెంపాలెం ఎంపీపీ పాఠశాలలో జరిగిందీ విషాద ఘటన. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావు (50), భార్య పరమేశ్వరి (45) భార్య భర్తలు. దంపతులిద్దరూ వేర్వేరు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వరరావు తాడేపల్లిగూడెం మండలం  పట్టెంపాలెం గ్రామంలో ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
డ్యూటీలో భాగంగా సోమవారం స్కూలుకు వచ్చారు.  మధ్యాహ్నం భోజనం తర్వాత స్కూల్ ప్రారంభమైన వెంటనే వెంకటేశ్వరరావు పిల్లలకు పాఠం చెబుతుండగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ అపస్మారకస్థితికి చేరగా స్కూలులోని తోటి ఉపాధ్యాయులు హుటాహుటిన తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించేలోగానే తుదిశ్వాస విడిచారు. గంట సేపటి క్రితం వరకు తమతో హుషారుగా మాట్లాడి.. పిల్లలతో చలాకీగా గడిపిన ఉపాధ్యాయుడు గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రికి తరలించినా కోలుకోలేక కన్నుమూయడం గ్రామంలో విషాదం రేపింది. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని చూసిన ఉపాధ్యాయులందరూ కంటతడిపెట్టుకున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోని  విద్యారంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.