ఎస్సీ గురుకులాల్లో 317 జీవో బదిలీలను సరిచేయాలి!..టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్

ఎస్సీ గురుకులాల్లో 317 జీవో బదిలీలను సరిచేయాలి!..టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్
  • ముగిసిన టిగారియ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 317 కారణంగా ఎస్సీ గురుకుల టీచర్లకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని టీచర్​ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్​ చేశారు. 317 జీవో బదిలీల వల్ల జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని, టీచర్లకు వారి స్వస్థలాల్లోనే సేవ చేసే అవకాశం కల్పించాలని, స్థానికత ప్రకారం కేటాయింపులు జరగాలని ఎస్సీ గురుకుల టీచర్లు డిమాండ్ చేస్తూ, తెలంగాణ గురుకుల ఆల్ రెసిడెన్షియల్ ఇన్​స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టిగారియ) ఆధ్వర్యంలో నిర్వహించిన బస్ యాత్ర గురువారం ముగిసింది. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ.. స్థానికతను పక్కనబెట్టి చేసిన బదిలీల వల్ల ఎస్సీ గురుకుల టీచర్లు తీవ్ర అన్యాయానికి గురైన సంగతి తెలిసిందేనన్నారు. ఎక్కడెక్కడో దూరంగా బదిలీ అయిన టీచర్లు తమ కుటుంబాలకు, పిల్లల విద్యకు దూరమై, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్యకు అందించారు. 

టిగారియా సంఘం ప్రతినిధులతో కలిసి తమ డిమాండ్లను వినిపించారు. ‘జీవో 317 లో జరిగిన అన్యాయాలను సరిచేసి, స్థానికత ఆధారంగా బదిలీలను పునఃసమీక్ష చేయాలని, ఇతర జోన్లకు బదిలీ అయిన టీచర్లను వారి స్వస్థలాలకు తిరిగి ట్రాన్సఫర్​ చేయాలని, గురుకుల టీచర్లకు సమాన అవకాశాలు కల్పించాలి’ అని కోరారు.