- లేదంటే ఉద్యమిస్తాం ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక
న్యూఢిల్లీ, వెలుగు: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని జాతీయ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. టెట్ తప్పనిసరి నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని, లేదంటే దేశవ్యాప్త ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి. బుధవారం ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు సీఎన్ భార్తి అధ్యక్షతన అఖిల భారత స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది.
మీటింగ్ అనంతరం చావ రవి మాట్లాడారు. టెట్ తప్పనిసరిపై దేశ వ్యాప్తంగా టీచర్లు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో ఎంపీలు ప్రశ్నిస్తున్నప్పటికీ కేంద్రం పునరాలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.
టెట్ సమస్యతో పాటు ఎన్‌పీఎస్, యూపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పాఠశాలల విలీనం, మూసివేతలను నిలిపేయాలని, ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలనే డిమాండ్లపై ఉద్యమించాలని సమావేశంలో నిర్ణయించినట్టు వెల్లడించారు.

