స్టూడెంట్లే కాదు టీచర్లు యూనిఫాంలో వస్తున్రు

స్టూడెంట్లే కాదు టీచర్లు యూనిఫాంలో వస్తున్రు

బీహార్: ఎన్ని స్ట్రిక్ట్  రూల్స్ పెట్టినా ప్రైవేట్ పాఠశాలల్లో  వందకు వంద శాతం విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ లో రావడం చాలా కష్టం. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అయితే చెప్పనక్కర్లేదు. చాలా ప్రభుత్వ స్కూళ్లలో యూనిఫాం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ బిహార్ లోని ఓ ప్రభుత్వ స్కూల్లో మాత్రం విద్యార్థులతోపాటు టీచర్లు కూడా యూనిఫాంలో వస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే... బీహార్ రాష్ట్రంలోని గాయత్రి జిల్లా బాంకే బజార్ బ్లాక్ పరిధిలోని  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, టీచర్లు ప్రతి రోజు స్కూల్ యూనిఫాంలోనే స్కూల్ కి వస్తున్నారు. వాళ్లే కాకుండా వంట మనుషులు, గార్డ్స్ కూడా యూనిఫాం వేసుకుంటున్నారు.

టీచర్లు యూనిఫాంలో రావడం వల్ల విద్యార్థులు, టీచర్ల మధ్య గ్యాప్ తగ్గిందని, విద్యార్థులు టీచర్లతో బాగా కలిసిపోతున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్ దాస్ చెబుతున్నారు. ఈ పరిణామం వల్ల గురు శిష్యుల బంధం మరింత పెరిగి... విద్యార్థులు మునుపటి కంటే చదువుల్లో బాగా రాణిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మొదట్లో తన సొంత డబ్బుతో టీచర్లు, విద్యార్థులకు తలా ఓ జత యూనిఫాం కొనిచ్చానని, ప్రస్తుతం విద్యార్థులు, టీచర్లు తమ సొంత డబ్బు వెచ్చించి యూనిఫాంలో వస్తున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు.