ఉపాధ్యాయ దినోత్సవ స్పెషల్: గురువులందరికీ ఇవే వందనాలు

ఉపాధ్యాయ దినోత్సవ స్పెషల్:  గురువులందరికీ ఇవే వందనాలు

టీచర్లు.. బడిలో అమ్మలా ప్రేమని పంచుతారు. నాన్నలా మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. మంచి ఫ్రెండ్​లా గైడ్​ చేస్తారు. తోబుట్టువుల్లా ధైర్యాన్ని నింపుతారు. సొసైటీలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తారు. వీటన్నింటికి బదులుగా మన ఎదుగుదలని మాత్రమే కోరుకుంటారు. అదే వాళ్లకి సంతోషం. అలా మన జీవితంలో కీ రోల్​ పోషించిన గురువులందర్నీ ఈ టీచర్స్​ డే రోజు గుర్తుచేసుకుందామా!

జోవియల్, మూడీ, కాస్త కన్ఫ్యూజన్, స్ట్రిక్ట్, క్లాస్​ రూంలోనే కాదు ఆ క్లాసులు చెప్పే టీచర్లూ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. వాళ్ల గురించి చెప్పాలంటే ముందు ఫేవరెట్​ నుంచి మొదలుపెడదాం.

ప్రతి స్టూడెంట్​ లైఫ్​లో ఒక ఫేవరేట్​ టీచర్​ ఉంటారు. ఆ ఇష్టానికి కారణం ఆ ఫలానా మాస్టారు చెప్పే పాఠాలే కాదు.. వాళ్ల  వ్యక్తిత్వం కూడా. ఎప్పుడూ స్టూడెంట్స్​ని కడుపుబ్బా నవ్విస్తుంటారు ఈ ఫేవరెట్​ టీచర్లు. ఫస్ట్​ బెంచ్​ సుకన్య నుంచి మొదలుపెట్టి, చివరి బెంచ్​ మీద చివరాఖర్న కూర్చున్న సుదేశ్​ వరకు అందర్నీ పలకరిస్తారు. పిల్లలతో ఫ్రెండ్​ లా కలిసిపోతారు. పాఠాలతో పాటు అన్ని విషయాలు చెప్తారు. అందకే వీళ్లు చాలా మందికి ఫేవరెట్.

క్లాస్​ రూం తలుపు నుంచే పాఠం మొదలుపెట్టే టీచర్లు ప్రతి ఒక్కరి లైఫ్​ లో ఉంటారు. పీరియడ్​ ముగిసినా.. వీళ్ల పాఠం వినబడుతూనే ఉంటుంది. ఏ టీచర్​ సెలవులో ఉన్నా వాళ్ల పీరియడ్​ టైంకి క్లాసులో దూరిపోతారు. కొన్ని సార్లు వేరే టీచర్లని బతిమాలి మరీ క్లాసులు తీసుకుంటారు. పొరపాటున వీళ్ల క్లాసు లాస్ట్​ అవర్​ లో వచ్చిందో.. ఇక అంతే. మార్కులు తక్కవోస్తే బెత్తం దెబ్బలు. పాఠం గుర్తించుకోకపోతే గుంజీలు. ఇవన్నీ చూసి 'ఈ టీచర్​ బాగా స్ట్రిక్ట్' అని చిన్నప్పుడు తప్పించుకొని తిరిగినా.. ఇప్పుడు ఆలోచిస్తే మన భవిష్యత్తు కోసం వాళ్లు పడ్డ ఆరాటమే కనిపిస్తుంది. 

ఇన్నేళ్ల సర్వీస్​లో నేను చూసిన వేస్ట్​ బ్యాచ్​ మీరే అంటూ మొదలుపెడతారు ఫ్రస్టేషన్​ టీచర్లు. మీరు దేనికీ పనికిరారు అంటూ తిడుతుంటారు. వందకి 99 మార్కులొచ్చినా స్టూడెంట్స్ ని మెచ్చుకోరు. కొన్నిసార్లు ఇంకా బాగా చదవాలని మార్కులు తగ్గించి వేస్తుంటారు కూడా. 

రోజూ బెత్తం పట్టుకొని క్లాసుకి వస్తారు కొందరు టీచర్లు. ప్రశ్నలకి జవాబు చెప్పలేదో మీ పని అంతే అంటూ భయానికే భయం పుట్టిస్తారు. కానీ, ఏ రోజూ ఆ బెత్తానికి పని చెప్పరు వీళ్లు. పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చినా.. 'ఇంకోసారి మంచి మార్కులు రాకపోతే' అంటూ బెదిరిస్తారే తప్ప శిక్షించరు. ఎవరైనా ఇబ్బంది పడుతున్న చూడలేరు. వీళ్ల వీక్​ పాయింట్​ తెలిసిన స్టూడెంట్స్​ రోజుకో సాకుతో వీళ్లని మభ్య పెడుతుంటారు. 

లెక్కల టీచర్​ హోం వర్క్​ ఎక్కువ ఇచ్చినా.. సోషల్​ సార్​ ఆటల టైంలో ఎక్స్​ట్రా క్లాసు తీసుకున్నా ఊరుకోని పీఈటీ టీచర్లు ఉంటారు. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు, పాటలు కూడా అంతే ముఖ్యం అన్నది ఈ టీచర్ల వాదన. జీవితంలోఎదురయ్యే సమస్యల గురించి.. వాటిని ఎలా ఫేస్​ చేయాలి లాంటి విషయాలు చెబుతుంటారు. వీళ్లు ప్రతి సందర్భంలో స్ఫూర్తి నింపుతారు. ఇలా మన జీవితంలో అడుగడుగునా అండగా నిలిచిన గురువులందరికీ ఈ టీచర్స్ డే రోజున స్పెషల్​ థ్యాంక్స్ చెప్పుకుందాం.