ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా దసరా సెలవుల్లో టీచర్ల ట్రాన్స్​ఫర్స్, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేయాలని టీచర్లు కోరారు. యూఎస్ పీసీ ఆధ్వర్యంలో ఆదివారం సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్​ముందు వారు ఒకరోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్లు మాట్లాడారు. ప్రభుత్వం ఏడేళ్ల నుంచి ట్రాన్స్​ఫర్స్, ప్రమోషన్ లు చేపట్టడంలేదన్నారు. అన్ని జిల్లాలకు డీఈఓలు, మండలాలకు ఎంఈఓల పోస్టులను మంజూరు చేయాలన్నారు. టీచర్ల ఖాళీలను కూడా భర్తీ చేయాలన్నారు. సీపీఎస్ ను రద్దు చేసి పాత పింఛన్​విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ శ్రీధర్, టీపీటీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, డీటీఫ్ జిల్లాధ్యక్షుడు శ్రీహరి తదితరులు  పాల్గన్నారు.

‘విమోచన’పై టీఆర్​ఎస్​ దిగొచ్చింది’

పెగడపల్లి,వెలుగు: తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని కేంద్ర హోం శాఖ అధికారికంగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంతో టీఆర్​ఎస్​తో పాటు ప్రతిపక్ష పార్టీలు పంథా మార్చుకున్నాయని జగిత్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యం పేర్కొన్నారు. ఆదివారం పెగడపల్లి మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు గంగుల కొమురెల్లి తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పటి సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యను నిలదీయలేదా అని ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలతో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఉలిక్కి పడ్డారని, సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా పాటించాలని పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. సమావేశంలో బీజేపీ లీడర్లు చింతకింది కిషోర్ కుమార్, కొత్తూరు బాబు, అంజి పాల్గొన్నారు.

టీచర్ల సంక్షేమానికి చట్టం చేయాలి:ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్
కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం పార్లమెంట్​లో చట్టం చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని రంగినేని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉత్తమ టీచర్ల అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్​తయారవుతుందని అన్నారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత టీచర్లదేనన్నారు. దేశవ్యాప్తంగా అనేక వర్గాలకు సంఘాలు ఉన్నాయని, ప్రైవేటు టీచర్లకు కూడా సంఘాలు ఉండాలన్నారు. భవన కార్మికులకు ఇస్తున్న సంక్షేమ ఫలాలు టీచర్లకు కూడా అందచేయలని వినోద్​కుమార్​డిమాండ్ చేశారు. విద్యాబోధనలో 54 శాతం మంది ప్రైవేట్ రంగంలోనే ఉన్నారని గుర్తు చేశారు. ప్రైవేటు టీచర్లతో త్వరలో హైదరాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్​రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పాల్గొన్నారు.

తెలంగాణను నాశనం చేస్తుండ్రు

హుజూరాబాద్​ వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​నాశనం చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ  కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గ ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర ఆదివారం కేశవపట్నం మండలంలోని పలు గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా కపిలవాయి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమకారులను, ప్రశ్నించే గొంతుకలను కేసీఆర్​అణగదొక్కుతున్నారని అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి శంకరపట్నం మండలం అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ర్యాలీలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, వాసుదేవ రెడ్డి, నాగరాజు, ఎల్లన్న, జయ చందర్, అజయ్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి  పాల్గొన్నారు.

వీఆర్ఏల గోడు ప్రభుత్వానికి పట్టదా?:  కాంగ్రెస్ లీడర్ ​మహేందర్ రెడ్డి 
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: గత 42 రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేస్తుంటే వారి గోడు ప్రభుత్వానికి పట్టదా అని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. సిరిసిల్లలో దీక్షకు వీఆర్​ఏలకు ఆదివారం ఆయన సంఘీభావ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలన్నారు. డిమాండ్ లు సాధన కోసం వీఆర్ఏ ప్రాణ త్యాగం చేయడం బాధాకరమన్నారు. ఆయన వెంట ప్రవీణ్ తిరుపతిరెడ్డి, గోనె ఎల్లప్ప, వేణుగోపాల్,  భూపతి, రవి, మునిగేల రాజు ఉన్నారు.

జీఎస్టీతో ప్రజలను దోచుకుంటున్నరు

పెరిగిన ధరలపై కాంగ్రెస్ నిరసన
జగిత్యాల, వెలుగు: జీఎస్టీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను దోచుకుంటున్నాయని కాంగ్రెస్​లీడర్లు విమర్శించారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ తీరుపై జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాలలో నిరసన చేపట్టారు. స్థానిక ఇందిరా భవన్ నుంచి బయలుదేరి తహసీల్ చౌరస్తా వద్ద కూరగాయల దండలు వేసుకొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఎత్తివేసి మధ్యతరగతి కుటుంబాలను ఆగం చేస్తున్నారని అరోపించారు. 2014 వరకు రూ.435 ఉన్న సిలండర్ ధర ప్రస్తుతం రూ.1150 చేశారన్నారు. కూరగాయలు, పప్పులు, వంట నూనె, చింతపండు, టీ పౌడర్, పిండి, అటుకులు, ఉప్పు, పసి పిల్లలు తాగే పాల ధరపై జీఎస్టీ వేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలని అన్నారు. నిరసనలో మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, పులి సునీత, బింగి సుమ, చిట్ల లత, ఆకరపు  రూప, నాగిరెడ్డి రజిత, సుజాత, కుర్మ లత పాల్గొన్నారు.

ప్రశాంతంగా సింగరేణి రాత పరీక్ష 
తిమ్మాపూర్, వెలుగు: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం తిమ్మాపూర్​మండలంలోని పలు కాలేజీలలో ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీలక్ష్మి తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. 19,837 మంది అభ్యర్థులకుగాను 16,282 మంది హాజరయ్యారు. కాగా నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమనే నిబంధన ప్రకారం చాలామంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. దూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులను నిమిషం నిబంధనలతో అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు కన్నీటి పర్యవంతమయ్యారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో సరిపడా బస్సు సౌకర్యం లేక పరీక్షకు హాజరు కాలేకపోయామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వాహకులను, పోలీసు సిబ్బందిని వేడుకున్నప్పటికీ అనుమతించకపోవడంతో పలువురు విద్యార్థులు విలపిస్తూ వెనుతిరిగారు.

సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుకుందాం
కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: అన్ని డివిజన్లలో సమస్యలను దశలవారీగా పరిష్కరించి, కరీంనగర్​ను సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుకుందామని మేయర్ సునీల్ రావు అన్నారు. ఆదివారం 22వ డివిజన్ బుట్టిరాజారాం కాలనీలో రూ.40లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. శివారు కాలనీలతోపాటు పేదలు నివసించే ప్రాంతాల అభివృద్ధిపై  ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. సుభాశ్​నగర్ నుంచి సీతారాంపూర్ వెళ్లే రోడ్డును త్వరలో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగేమల్లేశ్వర్ రావు, ఈఈ కిష్టప్ప, డీఈ వెంకటేశ్వర్లు,  పాల్గొన్నారు.

కమిషన్ల కోసం నాసిరకం పనులు
కోనరావుపేట,వెలుగు: కాజ్​వేల మరమ్మతు పనుల్లో టీఆర్ఎస్ నేతలు కమిషన్ల కోసం కక్కుర్తి పడి నాణ్యతలేని పనులు చేయిస్తున్నారని బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్ రావు అన్నారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట, బావుసాయిపేట మధ్య మూలవాగులో జరుగుతున్న కాజ్​వే మరమ్మతు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. కాజ్​వేల మరమ్మతులకు రూ.19లక్షలు మంజూరు కాగా టీఆర్ఎస్ నేతల అండదండలతో కాంట్రాక్టర్ నాణ్యత పాటించకుండా పనులు చేస్తున్నారన్నారు. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండలాధ్యక్షుడు రామచంద్రం, బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు మోహన్, నాయకులు ఉన్నారు.

గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
సిరిసిల కలెక్టరేట్, వెలుగు: ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది నలిమెల శ్రీనివాస్ శనివారం గుండెపోటుతో చనిపోయారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ కు చెందిన శ్రీనివాస్​స్థానిక శివనగర్ లో ఉంటూ 30 ఏండ్లుగా లా ప్రాక్టీస్​చేశారు. రెండేళ్లుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధ పడ్డారు. శ్రీనివాస్ కు భార్య శైలజ,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్ ప్రముఖ కవి నలిమెల భాస్కర్ కు తమ్ముడు. లాయర్ గా ఉంటూనే రంగస్థల నటుడిగా విలక్షణ పాత్రలు పోషించారు. ఏకపాత్రాభినయం చేసేవారు. కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆయన మృతి పట్ల టీఆర్​ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, ఆకునూరి శంకరయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్​రావు, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శనిగరం వసంతం తదితరులు సంతాపం తెలిపారు. 


ఆడ బిడ్డలకు అండగా సర్కార్​: ఎమ్మెల్యే రవిశంకర్​
గంగాధర, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆదివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్​లో ఆయన కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో రామడుగు పీఏసీఎస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, మాజీ చైర్మన్​మహిపాల్​రావు  పాల్గొన్నారు.