గుడ్ న్యూస్.. జడేజా మోకాలి సర్జరీ సక్సెస్..

గుడ్ న్యూస్.. జడేజా మోకాలి సర్జరీ సక్సెస్..

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్రజడేజా మోకాలి సర్జరీ సక్సెస్ అయింది. మోకాలి గాయంతో జడేజా తీవ్రంగా బాధపడుతుండటంతో...బీసీసీఐ అతడికి శస్తచికిత్స చేయించింది.  తన మోకాలికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని జడేజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. త్వరలో  శిక్షణ, ఫిట్నెస్  కార్యక్రమాలు మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు. 

ధన్యవాదాలు..
నా మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఇందుకు బీసీసీఐ, సహచరులు, సహాయ సిబ్బంది, ఫిజియోలు, వైద్యులు, అభిమానులకు ధన్యవాదాలు.  నేను అతి తొందరలో  రిహబిలిటేషన్‌కు వెళ్తాను. సాధ్యమైనంత వేగంగా తిరిగొస్తాను. మీ విషెస్‌కు కృతజ్ఞతలు' అని జడ్డూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.  ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ పట్టుకుని దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.

అర్థాంతరంగా టోర్నీకి దూరం..
ఐపీఎల్‌ 2022 తర్వాత గాయంతో జడేజా సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. చెన్నైకి ఆడుతుండగానే మోకాలి గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ తర్వాత గాయంతోనే జులైలో వెస్టిండీస్‌ సిరీస్కు దూరమయ్యాడు. మళ్లీ ఫిట్‌నెస్ నిరూపించుకొని ఆసియాకప్‌కు ఎంపికయ్యాడు. పాకిస్థాన్‌, హాంకాంగ్‌ మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేశాడు.  పాక్తో జరిగిన మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చి  29 బంతుల్లో 35 పరుగులు సాధించాడు.  హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్లో బాబర్‌ హయత్‌ను ఔట్‌ చేసి 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చాడు.  ఈ మ్యాచ్ అనంతరం మోకాలి గాయం ముదరడంతో అతను ఆసియా కప్ నుంచి వైదొలిగాడు. 

టీమిండియా చిరుత జడేజా..
టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది రవీంద్ర జడేజా. గ్రౌండ్లో చిరుత వేగంతో పరుగెత్తడం, రెప్పపాటులో రనౌట్లు చేయడం జడేజా స్పెషాలిటీ. అయితే ఈ మధ్య అతను తరచూ గాయపడుతున్నాడు. అయితే గాయం కారణంగా ఆసియాకప్ నుంచి తప్పుకోవడంతో..టీ20 వరల్డ్ కప్కు జడ్డూ అందుబాటులో ఉంటాడంపై సందిగ్ధం నెలకొంది. కానీ టీమిండియా  కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం జడేజా టీ20 ప్రపంచ‌కప్‌ వరకు కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. టోర్నీకి మరో 40రోజులు ఉండడం.. సర్జరీ సక్సెస్ కావడంతో పాటు రవీంద్రా జడేజా పోస్ట్ చేయడంతో ..ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ వరకు జడేజా పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చే ఛాన్సుంది.