న్యూజిలాండ్‌‌తో టీమిండియా ఢీ.. కోహ్లీ కెప్టెన్సీకి అగ్ని పరీక్ష

న్యూజిలాండ్‌‌తో టీమిండియా ఢీ.. కోహ్లీ కెప్టెన్సీకి అగ్ని పరీక్ష
  • గెలవాలంతే
  • నేడు న్యూజిలాండ్‌‌తో టీమిండియా ఢీ
  • ఓడితే సెమీస్‌‌ ఆశలు క్లిష్టం!
  • ఒత్తిడిలో కోహ్లీసేన

ఫేవరెట్‌‌ ట్యాగ్‌‌తో టీ20 వరల్డ్‌‌కప్‌‌ వేట మొదలుపెట్టిన టీమిండియాకు.. పాకిస్తాన్‌‌ మ్యాచ్‌‌ దిమ్మతిరిగేలా చేసింది..! మరి ఆ షాక్‌‌ నుంచి కోహ్లీసేన కోలుకుంటుందా? ప్రస్తుతం ఫ్యాన్స్‌‌ను కలవరపెడుతున్న అతిపెద్ద ప్రశ్న ఇది..! దీనికి ఆన్సర్‌‌ దొరకాలంటే.. నేడు న్యూజిలాండ్‌‌తో జరిగే కీలక పోరులో ఇండియా గెలిచి తీరాలంతే..! కానీ, ఐసీసీ టోర్నీల్లో ఇండియాపై ఎప్పుడూ కివీస్‌‌దే పైచేయి..! 18 ఏళ్లుగా ఈ రికార్డును చెక్కు చెదరకుండా చూసుకుంటున్న  న్యూజిలాండ్​.. గత వన్డే వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌, వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్స్‌‌ రిజల్ట్‌‌ను రిపీట్‌‌ చేయాలని చూస్తోంది..! మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో టీమిండియా పుంజుకుంటుందా..? కివీస్​పై పంజా విసిరి సెమీస్​ రేస్​లో నిలుస్తుందా..?

దుబాయ్‌‌: టీమిండియాకు పరీక్ష. విరాట్‌‌ కోహ్లీ కెప్టెన్సీకి అగ్ని పరీక్ష.  ఘోర ఓటమితో టీ20 వరల్డ్‌‌కప్‌‌ను మొదలు పెట్టిన కోహ్లీసేన ఆదివారం జరిగే  సూపర్‌‌12 గ్రూప్‌‌2 లో తమ రెండో పోరులో న్యూజిలాండ్‌‌తో సవాల్‌‌కు రెడీ అయింది. హ్యాట్రిక్‌‌ విక్టరీలతో పాక్‌‌ సెమీస్‌‌ బెర్తును ఇప్పటికే దాదాపు ఖాయం చేసుకోగా..  గ్రూప్‌‌2 నుంచి ఇంకో బెర్తు కోసం ఇండియా, కేన్‌‌ విలియమ్సన్‌‌ కెప్టెన్సీలోని కివీస్‌‌ పోటీ పడుతున్నాయి. అద్భుతం జరిగితే తప్ప అఫ్గానిస్తాన్‌‌, నమీబియా, స్కాట్లాండ్‌‌ రేసులోకి వచ్చే చాన్స్‌‌ లేకపోవడంతో  ఈ మ్యాచ్‌‌లో నెగ్గిన జట్టే సెమీస్‌‌ చేరడం ఖాయమే అనొచ్చు. ఈ  నేపథ్యంలో పాక్‌‌ చేసిన గాయాన్ని మరిచి మెగా టోర్నీలో తమ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెట్టాలని కెప్టెన్‌‌ కోహ్లీ భావిస్తున్నాడు.  ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో చేసిన మిస్టేక్స్‌‌ను సరిదిద్దుకొని కివీస్‌‌ను ఓడించాలని ఆశిస్తున్నాడు.  కానీ, అది అంత సులభం కాబోదు. తమ తొలి పోరులో పాక్‌‌ చేతిలో ఓటమి నుంచి బలంగా పుంజుకోవాలని కివీస్‌‌ కూడా కృత నిశ్చయంతో ఉంది. బౌలింగ్‌‌లో ఆ జట్టు మనకంటే చాలా బలంగా ఉంది. ట్రెంట్‌‌ బౌల్ట్‌‌లాంటి వరల్డ్‌‌ క్లాస్‌‌ పేసర్ల నుంచి ఇండియాకు సవాల్‌‌ తప్పదు. 

అందరూ అదరగొట్టాల్సిందే..
పాక్‌‌తో తొలిపోరులో ఇండియా పూర్తిగా తేలిపోయిందని కెప్టెన్‌‌ కోహ్లీనే ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ మ్యాచ్‌‌లో చేసిన తప్పిదాలను తక్షణం సరిదిద్దుకోవాల్సిందే. ముఖ్యంగా ఫుల్‌‌ఫామ్‌‌లో ఉన్న ఓపెనర్లు రోహిత్‌‌ శర్మ, కేఎల్‌‌ రాహుల్‌‌ ఫెయిలవడం దెబ్బకొట్టింది. ఈ మ్యాచ్‌‌లో వీరిద్దరూ కీలకం కానున్నారు. కివీస్‌‌ స్టార్‌‌ పేసర్​ ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ అండ్‌‌ కో కొత్త బాల్‌‌తో విసిరే సవాల్‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొని శుభారంభం ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఫిఫ్టీ చేసిన కోహ్లీ అదే జోరు కొనసాగించాలని ఆత్రుతగా ఉన్నాడు. తను ఇంకాస్త వేగంగా ఆడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌‌గానూ విరాట్‌‌కు ఈ పోరు చాలా కీలకం. ఇందులో ఓడితే మెగా టోర్నీలో ఇండియా ప్రయాణం, టీ20 కెప్టెన్‌‌గా కోహ్లీ ప్రస్థానం ముగిసినట్టే. కాబట్టి తనపై మరింత ఒత్తిడి ఉంటుంది. ఇక,  నాలుగో నంబర్‌‌లో మరోసారి అవకాశం ఇస్తే సూర్యకుమార్‌‌ సత్తా చాటాల్సిందే. లేదంటే ఇషాన్‌‌ కిషన్‌‌కు దారి వదలాల్సి ఉంటుంది. పంత్‌‌ ఫామ్‌‌లో ఉండటం ప్లస్‌‌ పాయింటే అయినా తను మరికొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో టీమ్‌‌ను ముంచింది బౌలింగే. ముఖ్యంగా హార్దిక్‌‌ పాండ్యా, భువనేశ్వర్‌‌  కుమార్‌‌ పేలవ ఫామ్‌‌ టీమ్‌‌కు ప్రధాన బలహీనతగా మారింది. పూర్తి ఫిట్‌‌నెస్‌‌ లేని,  బౌలింగ్‌‌ చేయలేని ఆల్‌‌రౌండర్‌‌  పాండ్యాను ఆడించడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆరో బౌలర్‌‌గా పనికిరాని తను  ఫినిషర్‌‌ రోల్‌‌లో పాక్‌‌పై పూర్తిగా ఫెయిలయ్యాడు. నెట్స్‌‌లో బౌలింగ్‌‌ ప్రాక్టీస్‌‌ స్టార్ట్​ చేసిన పాండ్యా విషయంలో మేనేజ్‌‌మెంట్‌‌ ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.  ఈసారి కొనసాగిస్తే మాత్రం పాండ్యా కచ్చితంగా సత్తా చాటాల్సిందే.  లేదంటే వేటు పడుతుంది. భువీకి కూడా ఇదే వర్తిస్తుంది. తన బౌలింగ్‌‌లో పేస్‌‌ క్రమంగా తగ్గుతోంది. స్వింగ్‌‌ కూడా అంతగా లేదు. తన ప్లేస్‌‌లో శార్దూల్‌‌ ఠాకూర్‌‌ను ఆడించే చాన్సుంది. ఒకవేళ అనుభవం అక్కరకొస్తుందని మరో చాన్స్‌‌ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ, ఈసారి ఫెయిలైతే భువీ ఇంటర్నేషనల్ కెరీరే దెబ్బతినొచ్చు. మరో ఇద్దరు సీనియర్‌‌ పేసర్లు షమీ, బుమ్రా పుంజుకుంటేనే ఇండియా ముందంజ వేయగలదు. ముఖ్యంగా పాక్‌‌పై ఫెయిలై.. ఆన్‌‌లైన్‌‌లో ట్రోలింగ్‌‌ చేసిన వారీకి షమీ తన ఆటతోనే  సమాధానం చెప్పాలని ఫ్యాన్స్‌‌ ఆశిస్తున్నారు. వరుణ్‌‌ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌‌ పాక్‌‌పై పారలేదు. ఈ మ్యాచ్‌‌లో తనను కొనసాగిస్తారా? లేక అశ్విన్‌‌, రాహుల్‌‌ చహర్‌‌లో ఒకరికి చాన్స్‌‌ ఇస్తారా? అనేది తేలాలి. ఫైనల్‌‌ ఎలెవన్‌‌ను మార్చినా మార్చకపోయినా.. టీమ్‌‌ అంతా సమష్టిగా ఆడితేనే కివీస్‌‌పై విజయం అందుకోగలదు.

కివీస్‌‌తో కష్టమే కానీ
బలాబలాలు, గత చరిత్ర చూస్తే ఇండియాకు కివీస్‌‌ చాలా కఠిన ప్రత్యర్థే అనొచ్చు. కానీ, ప్రస్తుతం ఆ టీమ్‌‌లోనూ కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌‌లో మనకంటే బలహీనంగా కనిపిస్తోంది. కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ వంద శాతం ఫిట్‌‌నెస్‌‌, ఫామ్‌‌లో  లేడు. ఓపెనర్‌‌ మార్టిన్‌‌ గప్టిల్‌‌ కూడా పాదం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. పాక్‌‌పై ఫీల్డింగ్‌‌కు దూరంగా ఉన్న తను రీసెంట్‌‌ నెట్‌‌ ప్రాక్టీస్‌‌లో మాత్రం బాగానే కనిపించాడు. మరో ఓపెనర్‌‌ డారిల్ మిచెల్‌‌, మిడిలార్డర్‌‌లో డెవాన్‌‌ కాన్వే టాలెంటెడ్‌‌ బ్యాటర్లు. వీళ్లపై ఇండియా బౌలర్లు ఓ కన్నేయాలి. బౌలింగ్‌‌లో మాత్రం కివీస్‌‌ బలంగా ఉంది. న్యూబాల్‌‌తో పవర్‌‌ఫుల్‌‌ స్వింగర్లతో హడలెత్తించే బౌల్ట్‌‌ను ఎదుర్కోవడం కీలకం కానుంది. నీషమ్‌‌, టిమ్‌‌ సౌథీతో పాటు స్పిన్నర్‌‌ ఇష్‌‌ సోధీ  పాక్‌‌పై సత్తా చాటాడు.  మిడిల్‌‌ ఓవర్లలో సోధీ బౌలింగ్‌‌లో ఇండియా బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఐసీసీ ఈవెంట్లలో ఇండియాపై మంచి రికార్డు ఉండటం కివీస్‌‌కు ప్లస్ పాయింట్ కానుంది.

టాస్‌‌ కీలకం
దుబాయ్‌‌ పిచ్‌‌పై ఈ ఏడాది జరిగిన 18 టీ20ల్లో 14సార్లు సెకండ్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన జట్లే నెగ్గాయి. రాత్రి పూట మంచు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఛేజింగ్‌‌ టీమ్‌‌కు అడ్వాంటేజ్‌‌ ఉంటుంది. అప్పుడు టాస్‌‌ కీలకం కానుంది. 

తుది జట్లు (అంచనాలు)
ఇండియా: రోహిత్‌‌, లోకేశ్‌‌, కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్‌‌, పంత్‌‌ (కీపర్‌‌), హార్దిక్‌‌, జడేజా, శార్దూల్‌‌/భువనేశ్వర్‌‌, షమీ, వరుణ్‌‌/అశ్విన్‌‌, బుమ్రా.
న్యూజిలాండ్‌‌: గప్టిల్‌‌, మిచెల్‌‌, విలియమ్సన్‌‌ (కెప్టెన్), కాన్వే, ఫిలిప్స్‌‌, నీషమ్‌‌, సీఫర్ట్‌‌ (కీపర్‌‌), శాంట్నర్‌‌, సౌథీ/మిల్నే, ఇష్‌‌  సోధీ, బౌల్ట్‌‌.