
- నేడు ఇంగ్లండ్‌తో తొలి టీ20
- రా. 10.30 నుంచి సోనీ సిక్స్‌లో
సౌతాంప్టన్: ‘ప్రయోగాలన్నీ ముగిశాయి.. ఇక మిగిలింది టీ20 వరల్డ్‌కప్ కోసం ఫైనల్ జట్టును ఎంపిక చేసుకోవడమే’ ఈ ఒక్క టార్గెట్‌తో ఇప్పుడు ఇండియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను మొదలుపెట్టబోతున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఇరుజట్ల మధ్య సౌతాంప్టన్‌లో తొలి టీ20 జరగనుంది. కొవిడ్‌తో ఐదో టెస్ట్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. తిరిగి గ్రౌండ్లోకి వస్తున్నాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా, శ్రేయస్, పంత్.. రెండో మ్యాచ్ నుంచి అందుబాటులోకి వస్తారు. దీంతో గైక్వాడ్, శాంసన్ వంటి యంగ్‌స్టర్స్‌కు మరో అవకాశం దక్కనుంది. మరి ఈ చాన్స్‌ను వీళ్లు ఉపయోగించుకుంటారా? లేదా? చూడాలి. చిన్న గాయంతో ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గైక్వాడ్ ఓపెనింగ్ చేయలేదు. రోహిత్ తిరిగొస్తే ఈసారి కూడా చాన్స్ దక్కకపోవచ్చు. రెండో మ్యాచ్ నుంచి కోహ్లీ మూడో ప్లేస్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా పరిస్థితి ఏంటనేది తేలాలి. ఐర్లాండ్‌పై సెంచరీతో పాటు 47 రన్స్ చేసిన హుడాతో పాటు సూర్యకుమార్‌ను ఎక్కడ ఆడించాలనే పెద్ద సమస్య ఇప్పుడు మేనేజ్‌మెంట్ ముందు ఉంది. అన్‌క్యాప్‌డ్ రాహుల్ త్రిపాఠి, అర్ష్‌దీప్ సింగ్‌కు చాన్స్ ఏమైనా ఇస్తారా? చూడాలి. బౌలింగ్‌లో పేసర్ ఉమ్రాన్ మరో చాన్స్ కోసం చూస్తున్నాడు. ఐర్లాండ్‌పై తేలిపోయిన భువనేశ్వర్, హర్షల్ పటేల్ గాడిలో పడాల్సిన అవసరం కనిపిస్తోంది. బిష్ణోయ్ ప్లేస్‌లో చహల్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకొవచ్చు.
బట్లర్‌తో భయమే..
మోర్గాన్ ప్లేస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న జోస్ బట్లర్‌కు ఈ సిరీస్ తొలి సవాల్‌గా మారింది. అయితే టీ20ల్లో ఇంగ్లండ్‌ను అందుకోవడం ఎలాంటి ప్రత్యర్థికైనా కొద్దిగా ఇబ్బందే. అయినా అతిథ్య జట్టు.. టీమిండియాను తక్కువగా అంచనా వేయడం లేదు. ఈ సిరీస్‌తో ఇంగ్లండ్ కూడా తమ వరల్డ్‌కప్ టీమ్‌పై అంచనాకు రావాలనుకుంటోంది. బెన్ స్టోక్స్, బెయిర్‌స్టోకు విశ్రాంతి ఇచ్చినా ఇంగ్లండ్‌లో నాణ్యమైన బ్యాటర్లకు, బౌలర్లకు కొదువలేదు. బట్లర్, లివింగ్‌స్టోన్‌తో ఇండియాకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది.