ఏడేళ్ల తర్వాత మూడో ర్యాంకు కోల్పోయిన కోహ్లీ..

ఏడేళ్ల తర్వాత మూడో ర్యాంకు కోల్పోయిన కోహ్లీ..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్లో దిగజారాడు. ఏడేళ్ల తర్వాత అంటే 2015 తర్వాత తొలిసారి మెన్స్ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ -3లో నిలవలేకపోయాడు. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో   కోహ్లీ..నాల్గో స్థానంలో ఉన్నాడు. 2011 నుంచి కోహ్లీ  ఐదో స్థానం కంటే దిగువ ర్యాంకుకు పడిపోలేదు. అటు  టెస్ట్‌ల్లోనూ కోహ్లీ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయాడు.  సౌతాఫ్రికాకు  చెందిన రాస్సీ వాన్ డర్ డస్సెన్ కోహ్లీ స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లాండ్ పై అతను సెంచరీ చేయడంతో..మూడో స్థానాన్ని  దక్కించుకున్నాడు. వన్డేల్లో అగ్రస్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్, రెండో స్థానంలో ఇమామ్ -ఉల్-హక్  కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ 5వ స్థానంలో ఉన్నాడు. 

ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో రాణించిన రిషబ్ పంత్, హార్థిక పాండ్యా వన్డే ర్యాంకింగ్స్లో మెరుగయ్యారు. మూడో వన్డేలో  పంత్ శతకం బాదడంతో 25స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరుకున్నాడు. అటు హార్దిక్ పాండ్యా  హాఫ్ సెంచరీ కొట్టడంతో..42వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 

బౌలింగ్ ర్యాంకింగ్స్లో బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. తొలి వన్డేలో 6 వికెట్లు పడగొట్టడంతో బుమ్రా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కానీ మూడో వన్డేలో ఆడకపోవడంతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో 4 వికెట్లు తీసిన పాండ్యా 25 స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. కివీస్ స్టార్ బౌలర్  ట్రెంట్ బౌల్ట్ ప్రస్తుతం  నెంబర్ వన్ లో ఉన్నాడు.