తొలి టీ 20లో టీమిండియా ఘన విజయం

తొలి టీ 20లో టీమిండియా ఘన విజయం

తిరువనంతపురం:సౌతాఫ్రికాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 110/2 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ లు నిలకడగా ఆడి జట్టును సునాయాసంగా విజయ తీరాలకు చేర్చారు. 

కెప్టెన్ రోహిత్ శర్మ రబడా బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విరాట్ కోహ్లీ మూడు పరుగులు చేసి విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 56  బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి మరోసారి తన బ్యాటింగ్ తో సత్తా చాటాడు. 

టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన  సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి106 రన్స్ చేసింది. కేశవ్ మహారాజ్ 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరంభంలో  టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. వరుస వికెట్లు తీసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశారు. 9  పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో వేన్ పార్నెల్ 19, మార్క్రమ్ 25 పరుగులు చేసి ఆరో వికెట్ కు 33 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.  తొలి ఓవర్ లోనే  సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా అవుటయ్యారు. దీపక్ చహర్ వేసిన ఈ ఓవర్ లో బవుమా క్లీన్ బౌల్డయ్యాడు. సెకండ్ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టి సూపర్బ్ అనిపించాడు. టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ 3, దీపక్ చహర్, హార్షల్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా..అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

ఈ సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన హార్దిక్, భువనేశ్వర్ దూరమవ్వగా..వారి స్థానంలో పంత్, అర్షదీప్ క్రీజులోకి వచ్చారు. అదేవిధంగా బుమ్రా స్థానంలో దీపక్ చహర్‌, చాహల్ స్థానంలో అశ్విన్  ఆడుతున్నారు.