హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరంగేట్రానికి 15 ఏళ్లు

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరంగేట్రానికి 15 ఏళ్లు

టీమిండియా హిట్ మ్యాన్ గా పిలుచుకునే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి నేటికి 15ఏళ్లు. 2007, జూన్ 23న బెల్ ఫాస్ట్ లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా తరపున తొలి మ్యాచ్ ఆడిన రోహిత్.. ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. తన ఈ 15 ఏళ్ల కెరీర్ ను పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా రోహిత్.. ఓ ఎమోషనల్ లెటర్ ను షేర్ చేసుకున్నాడు.  తనకు ఎంతో ఇష్టమైన జెర్సీలో ఈ జర్నీని పూర్తి చేసుకున్నానని రాసుకొచ్చాడు. ఈ ప్రయాణాన్ని ఎంతో అద్భుతమైనదిగా అభివర్ణించిన ఆయన.. తన ఇన్నేళ్ల క్రికెట్ జర్నీలో భాగమైన క్రికెట్ ప్రేమికులు, అభిమానులు, విమర్శకులందరికీ ధన్యావాదాలు తెలిపారు. జట్టు పట్ల మీకున్న ప్రేమ, మద్దతు వల్ల మనందరం అనివార్యంగా ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను అధిగమించామని, ప్రస్తుతం భారత క్రికెటర్ల పట్ల మీరు చూపుతున్న ప్రేమాభిమానాలు మన జట్టును ఈ స్థాయిలో ఉంచాయని రోహిత్ అన్నాడు.  ఈ రోజు తాను అంతర్జాతీయ ప్లేయర్ గా మారానంటే అది భారత క్రికెట్ అభిమానుల చలవేనని రోహిత్ అన్నాడు. జీవితాంతం తాను క్రికెట్ ను ఆదరిస్తానని రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా లేఖను పోస్ట్ చేశాడు.

విరాట్ కొహ్లీ నుంచి టీ20 జట్టు బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే టీమిండియా కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నట్టు సమాచారం.  గతేడాది ఇంగ్లాండ్, భారత్ మధ్య జరగాల్సిన (చివరి టెస్టు) ఐదో మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే మళ్లీ ఇప్పుడు జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ టెస్టులో భారత్ గెలిచినా.. లేదా డ్రా చేసుకున్నా సిరీస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.