
హరారే: స్టార్లు, సీనియర్లు లేకపోయినా ఊహించినట్టుగానే జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను ఘన విజయంతో షురూ చేసిన టీమిండియా శనివారం జరిగే రెండో వన్డేలో గెలిచి సిరీస్ నెగ్గాలని చూస్తోంది. తొలి పోరులో చిన్న టార్గెట్‌ను ఓపెనర్లే ఊదేయడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బ్యాటింగ్ చేసే చాన్స్ రాలేదు. గాయం నుంచి కోలుకున్న రాహుల్‌కు ఇప్పుడు గేమ్ టైమ్ అవసరం. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గితే బ్యాటింగ్ ఎంచుకొని వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని భావిస్తున్నాడు. బౌన్సీ ట్రాక్ పై ఉదయం పూట ప్రత్యర్థి బౌలర్ల నుంచి కాస్త అయినా సవాల్ ఎదురైతే దాన్ని ఎదుర్కోవాలని చూస్తున్నాడు. జింబాబ్వే జట్టులో స్టార్ బౌలర్లు ఎవ్వరూ లేకపోవడంతో మరీ ఏకపక్షంగా కాకుండా రాహుల్, ఇతర బ్యాటర్లకు ఎంతో కొంత చాలెంజ్ అవసరమే. మొదటి పోరులో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్, యంగ్‌స్టర్ శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్లుగా పంపిన రాహుల్ ఈ మ్యాచ్‌లో తానే ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.
గత మ్యాచ్‌లో ధవన్ ముంజేతికి గాయమైంది. ఈ నేపథ్యంలో రాహుల్...లెఫ్టాండర్ ఇషాన్ కిషన్‌తో ఓపెనర్‌గా రావొచ్చు. వచ్చే వారమే ఆసియా కప్ మొదలవుతున్న నేపథ్యంలో కేఎల్ టచ్‌లోకి రావాలి. తన బ్యాటింగ్‌లో ప్రయోగాలు చేసేందుకు ఈ రెండు మ్యాచ్‌లను ఉపయోగించుకోవచ్చు. ఇక, గాయం తర్వాత యంగ్ పేసర్ దీపక్ చహర్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. అతనితో పాటు ప్రసిధ్ కృష్ణ మరిన్ని వేరియేషన్స్ ట్రై చేయొచ్చు. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ వికెట్లు పడగొట్టాలని చూస్తున్నాడు. ఇక, తొలి వన్డేలో తేలిపోయిన జింబాబ్వే ఈ పోరులో అయినా ఇండియాకు పోటీ ఇస్తుందో లేదో చూడాలి.