లార్డ్స్ లో టీమిండియా ఘోర ఓటమి

లార్డ్స్ లో టీమిండియా ఘోర ఓటమి

లండన్‌‌‌‌‌‌:   తొలి వన్డేలో ఖతర్నాక్‌‌ బౌలింగ్‌‌తో  రెచ్చిపోయిన టీమిండియా రెండో పోరులో నిరాశ పరిచింది. ప్రఖ్యాత లార్డ్స్‌‌ క్రికెట్‌‌ స్టేడియంలో  స్పిన్నర్‌‌ యుజ్వేంద్ర చహల్ (4/47)తో పాటు బౌలర్లు అదే జోరు కొనసాగించినా.. బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్‌‌సేన  బోల్తా కొట్టింది. లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ రీస్‌‌ టాప్లీ (6/24)  వన్డేల్లో ఇంగ్లండ్​ తరఫున బెస్ట్​ బౌలింగ్​ నమోదు చేయడంతో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌‌లో ఇంగ్లిష్​​ టీమ్​  వంద పరుగుల తేడాతో ఇండియాను ఓడించి సిరీస్‌‌లో నిలిచింది.  తొలుత  ఇంగ్లండ్‌‌ 49 ఓవర్లలో 246 రన్స్‌‌కు ఆలౌటైంది.  మొయిన్‌‌ అలీ (47), డేవిడ్‌‌ విల్లీ (41) టాప్‌‌ స్కోరర్లు.  చహల్‌‌తో పాటు  హార్దిక్‌‌ (2/28), బుమ్రా (2/49) రాణించారు.  అనంతరం టాప్లీ దెబ్బకు  ఇండియా 38.5  ఓవర్లలో 146 రన్స్‌‌కే  ఆలౌటై ఓడిపోయింది.  కెప్టెన్‌‌ రోహిత్‌‌ (0),  పంత్‌‌ (0),  ధవన్‌‌ (9),  కోహ్లీ (16) ఫెయిలయ్యారు.  పాండ్యా (29), జడేజా (29), సూర్యకుమార్‌‌(27), షమీ (23) పోరాడినా ఫలితం లేకపోయింది. టాప్లీకు  ప్లేయర్ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. ఆదివారం  చివరి వన్డే  జరుగుతుంది.  

ఇండియా ఢమాల్‌‌
ఛేజింగ్‌‌లో ఓపెనర్లు రోహిత్‌‌, ధవన్‌‌తో పాటు పంత్‌‌, కోహ్లీ నిరాశ పరచడంతో 12 ఓవర్లకే 38/4 తో  ఇండియా ఎదురీత మొదలు పెట్టింది.  పది బాల్స్‌‌లో ఖాతా తెరువలేకపోయిన రోహిత్‌‌.. మూడో ఓవర్లో టాప్లీ ఫుల్‌‌ డెలివరీకి ఎల్బీ అయ్యాడు. నిదానంగా ఆడిన ధవన్‌‌... టాప్లీ  లెగ్ సైడ్‌‌ బాల్‌‌ను వెంటాడి కీపర్‌‌కు చిక్కాడు.  కార్స్‌‌ (1/32) వేసిన  లో ఫుల్‌‌టాస్‌‌కు పంత్‌‌ డకౌట్‌‌ అయ్యాడు. ఇక క్రీజులో కుదురుకున్న తర్వాత కోహ్లీ.. విల్లీ  ఆఫ్‌‌ స్టంప్‌‌నకు దూరంగా వేసిన బాల్‌‌ను వెంటాడి వికెట్‌‌ పారేసుకున్నాడు. ఈ దశలో హార్దిక్‌‌, సూర్య  ఐదో వికెట్‌‌కు 42 రన్స్‌‌ జోడించి ఇండియాను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, 21వ ఓవర్లో టాప్లీ బాల్‌‌ను వికెట్ల మీదకు ఆడుకున్న సూర్య ఐదో వికెట్‌‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా తోడుగా హార్దిక్‌‌ కాసేపు పోరాడాడు. అయితే, వేగంగా ఆడే ప్రయత్నంలో అలీ బౌలింగ్‌‌లో అతను లివింగ్‌‌స్టోన్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో 101/6తో ఇండియా ఓటమి ఖాయమైంది. అయితే, జడేజాకు తోడైన షమీ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌ కొట్టడంతో రోహిత్‌‌సేనలో కాస్త ఆశలు చిగురించాయి. కానీ, మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన టాప్లీ..  స్లో ఫుల్‌‌టాస్‌‌తో షమీని ఔట్‌‌ చేయగా.. తర్వాతి బాల్‌‌కే జడేజాను లివింగ్ స్టోన్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. తన తర్వాతి ఓవర్లోనే చహల్‌‌ (3), ప్రసిధ్‌‌ (0) పని పట్టిన టాప్లీ ఇండియాను ఆలౌట్‌‌ చేశాడు.

చహల్​ మ్యాజిక్​..
తొలుత టాస్‌‌ ఓడి బ్యాటింగ్​కు వచ్చిన ఇంగ్లండ్​కు ఓపెనర్లు జేసన్‌‌‌‌ రాయ్‌‌‌‌ (23),  బెయిర్‌‌‌‌స్టో  (38) తొలి వికెట్​కు 41 రన్స్​ జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. షమీ వేసిన ఐదో ఓవర్లో రాయ్‌‌‌‌ 4, 6తో జోరు పెంచాడు. అయితే, పవర్‌‌‌‌ప్లేలోనే హార్దిక్‌‌‌‌ పాండ్యాను బౌలింగ్‌‌‌‌కు దింపిన రోహిత్‌‌‌‌ ఫలితం రాబట్టాడు.  తన ఐదో బాల్‌‌‌‌కే రాయ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన హార్దిక్‌‌‌‌ ఇండియాకు బ్రేక్‌‌‌‌ ఇచ్చాడు. ఆ తర్వాత మిడిల్‌‌‌‌ ఓవర్లలో చహల్‌‌‌‌ హవా మొదలైంది.  బెయిర్‌‌‌‌స్టో, రూట్‌‌‌‌ (11), బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (21) పని పట్టిన అతను తర్వాత మొయిన్‌‌‌‌ అలీ వికెట్‌‌‌‌ కూడా రాబట్టాడు. చహల్‌‌‌‌ బాల్స్‌‌‌‌ను స్వీప్‌‌‌‌ షాట్స్‌‌‌‌ ఆడబోయి బెయిర్‌‌‌‌స్టో క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అవగా.. రూట్​ ఎల్బీగా వెనుదిరిగాడు. మధ్యలో షమీ అద్భుతమైన స్వింగర్‌‌‌‌తో బట్లర్‌‌‌‌ (4)ను క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ చేయగా.. 21వ ఓవర్లో చహల్‌‌‌‌ బాల్‌‌‌‌ను రివర్స్‌‌‌‌ స్వీప్‌‌‌‌ ఆడే ప్రయత్నంలో కెప్టెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ వికెట్ల ముందు దొరికిపోయాడు.  ఈ దశలో మొయిన్‌‌‌‌ అలీ తోడుగా లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ (33) ఎదురుదాడి చేశాడు. హార్దిక్‌‌‌‌ వేసిన 29వ  ఓవర్లో 6, 4 కొట్టిన అతను మరో షాట్‌‌‌‌ ఆడే ప్రయత్నంలో క్యాచ్‌‌‌‌ ఔట్‌‌‌‌ అవగా.. 148/6తో ఇంగ్లండ్‌‌‌‌ కష్టాల్లో పడింది. అయితే, అలీ, విల్లీ నిలకడగా ఆడుతూ ఏడో  వికెట్‌‌‌‌కు 62 రన్స్‌‌‌‌ జోడించడంతో ఆతిథ్య జట్టు 200 మార్కు దాటింది.   చివరకు 42 వ ఓవర్లో చహల్‌‌‌‌ ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌తో అలీని ఔట్‌‌‌‌ చేసి ఈ జోడీని విడదీశాడు. ఫిఫ్టీ చేసేలా కనిపించిన విల్లీని బుమ్రా పెవిలియన్‌‌‌‌ చేర్చగా.. ప్రసిధ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో బ్రైడన్‌‌‌‌ కార్స్‌‌‌‌ (2) ఎల్బీ అయ్యాడు. 49వ ఓవర్లో ఓ యార్కర్‌‌‌‌తో టాప్లీ (3)ని బౌల్డ్‌‌‌‌ చేసిన బుమ్రా ఇంగ్లండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను ముగించాడు.