
ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా క్వార్టర్ ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. న్యూజిలాండ్ చేతిలో 3-4 స్కోరు తేడాతో ఓడిపోయి..క్వార్టర్ ఫైనల్కు నేరుగా వెళ్లే ఛాన్స్ మిస్ చేసుకుంది. అటు భారత జట్టుపై గెలిచి పూల్ బీలో 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాం..డ్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.
వందనా వండర్..
క్వార్టర్ ఫైనల్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళ జట్టు నాలుగో నిమిషంలోనే గోల్ సాధించింది. వందనా కటారియా అద్భుతంగా బాల్ను గోల్ పోస్టులోకి పంపి..జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. 1-0తో టీమిండియా ఆధిక్యంలో వెళ్లడంతో న్యూజిలాండ్ కసితో ఆడింది. పెనాల్టి కార్నర్ను యూజ్ చేసుకున్న న్యూజిలాండ్..12వ నిమిషంలో ఒలివియా మెర్రి గోల్ చేసి స్కోరును సమం చేసింది. దీంతో ఫస్ట్ క్వార్టర్లో ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలిచాయి.
కివీస్ ఆధిక్యం..
ఇక రెండో క్వార్టర్లో భారత జట్టు మరింత అగ్రెసివ్గా ఆటను మొదలు పెట్టింది. కానీ ప్రత్యర్థి న్యూజిలాండ్ బాల్ను తన ఆధీనంలో పెట్టుకుంది. ముఖ్యంగా దుర్భేధ్యమైన డిఫెన్స్తో న్యూజిలాండ్ భారత జట్టును నిలువరించే ప్రయత్నం చేసింది. ఇదే దశలో 29వ నిమిషంలో టెస్సా జాప్ గోల్ చేసి న్యూజిలాండ్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. మూడో క్వార్టర్ లో న్యూజిలాండ్కు పెనాల్టీ కార్నర్లు వరమయ్యాయని చెప్పొచ్చు. వీటిని అద్భుతంగా ఉపయోగించుకున్న కివీస్..32వ నిమిషంలో మరో గోల్ సాధించింది. ఫ్రాన్సెస్ డేవీస్ గోల్ కొట్టడంతో..న్యూజిలాండ్ 3-1తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.
జోరు కొనగించిన న్యూజిలాండ్
అయితే 43వ నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ దక్కినా టీమ్ ఉపయోగించుకోలేకపోయింది. అయితే ప్రత్యర్థిపై మాత్రం ఒత్తిడి పెంచుకుంటూ పోయారు ప్లేయర్లు. అయితే 44వ నిమిషంలో సుశీల చాను ఇచ్చిన పాస్ను లాల్రేమ్సియామి గోల్గా మిలిచి..విజయావకాశాలను సజీవంగా ఉంచింది. ఫోర్త్ క్వార్టర్లో రెండు సార్లు భారత్కు పెనాల్టి కార్నర్లు దక్కినా..ఉపయోగించుకోలేకపోయారు. ఇక 54వ నిమిషంలో న్యూజిలాండ్ కు దక్కన పెనాల్టి కార్నర్ను అద్భుతంగా ఉపయోగించుకుంది. ఒలివియా మెర్రీ గోల్ చేసి..జట్టు ఆధిక్యాన్ని 4-2కు పెంచింది. దీంతో టీమిండియాకు ఓటమి దాదాపు ఖాయమైంది. అయితే చివరి నిమిషంలో రెండు పెనాల్టి కార్నర్లు దక్కించుకున్న భారత జట్టు..59 వ నిమిషంలో ఒక గోల్ చేసి ఆధిక్యాన్ని 4-3కు తగ్గించింది. అయితే అప్పటికే మ్యాచ్ సమయం అయిపోవడంతో..న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.
బెర్తు దక్కాలంటే గెలవాల్సిందే..
ప్రస్తుతం పూల్ బీలో భారత జట్టు 3 మ్యాచుల్లో రెండు మ్యాచులను డ్రా చేసుకుని ఒక మ్యాచ్ లో ఓడింది. ఫలితంగా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే భారత క్వార్టర్ ఫైనల్కు వెళ్లాలంటే జులై 10 స్పెయిన్తో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ గేమ్లో గెలిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లుంది. ఓడితే మాత్రం వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుంది.