టీమిండియా ఏంటి.. టీమ్ భారత్: జై షాకు సెహ్వాగ్ పంచ్

టీమిండియా ఏంటి.. టీమ్ భారత్: జై షాకు సెహ్వాగ్ పంచ్

వరల్డ్ కప్ 2023లో తలపడబోయే భారత జట్టును.. బీసీసీఐ మంగళవారం(సెప్టెంబర్ 5) ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపికైన 15 మంది పేర్లను వెల్లడిస్తూ.. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం ఎంపిక చేయబడిన టీమిండియా(#TeamIndia) స్క్వాడ్ ఇదిగో.. అని ట్వీట్ చేసింది. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా కాదు.. టీమ్ భారత్ అనండి అని వీరూ ఈ ట్వీట్ చేశాడు. ఈ మేరకు ఆటగాళ్లు ధరించే జెర్సీపై 'భారత్' అని ముద్రించాలని బీసీసీఐని మరియు దాని అధ్యక్షుడు జై షాను కోరారు.

"టీమిండియా కాదు.. టీమ్ భారత్. ఈ వరల్డ్ కప్‌లో మనం కోహ్లి, రోహిత్, బుమ్రా, జడేజాలాంటి వాళ్లను చీర్ చేస్తున్నప్పుడు మన గుండెల్లో భారత్ అని ఉండాలి. అంతేకాదు ఆటగాళ్లు భారత్ పేరున్న జెర్సీలను వేసుకోవాలి.. " అని బీసీసీఐ సెక్రటరీ జై షాను వీరూ ట్యాగ్ చేశాడు. మరో పోస్ట్ లో సెహ్వాగ్.. బ్రిటీష్ వాళ్లు ఇండియా అనే పేరు ఇచ్చారని, మనం ఎప్పుడూ భారతీయులమే అని పేర్కొనడం గమనార్హం. ఇండియా పేరును భారత్‌గా మార్చడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం కాబోతోందన్న వార్తల నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన ఈ పోస్ట్ తెగ  వైరలవుతోంది.

కాగా, స్వదేశంలో జరగబోయే ప్రపంచ కప్ పోరు కోసం 15 మంది సభ్యుల జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. పూర్తి స్థాయి ఫిట్ నెస్ సాధించిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కు జట్టులో చోటుదక్కగా.. శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చహల్ వంటి అనుభవమున్న ఆటగాళ్లను పక్కన పెట్టారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హర్డిక్ పాండ్య, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.