సఫారీ సవాల్‌‌‌‌కు సన్నద్ధం.. ఈడెన్ గార్డెన్స్‌‌‌‌లో జోరుగా టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌

సఫారీ సవాల్‌‌‌‌కు సన్నద్ధం.. ఈడెన్ గార్డెన్స్‌‌‌‌లో జోరుగా టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌

కోల్‌‌‌‌కతా: ఆస్ట్రేలియాతో వైట్‌‌‌‌ బాల్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను పూర్తి చేసుకున్న టీమిండియా ఇప్పుడు సౌతాఫ్రికాతో రెడ్‌‌‌‌ బాల్ సవాల్‌‌‌‌కు రెడీ అవుతోంది. రెండు టెస్టుల సిరీస్‌‌‌‌లో భాగంగా శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌‌‌‌లో మొదలయ్యే తొలి టెస్టు కోసం శుభ్‌‌‌‌మన్ గిల్ కెప్టెన్సీలోని ఆతిథ్య జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్‌‌ చేస్తోంది. మంగళవారం జరిగిన తొలి సెషన్‌‌‌‌లో  కెప్టెన్ గిల్, ఇతర ప్లేయర్లు  నెట్స్‌‌‌‌లో చెమటోడ్చారు. ముఖ్యంగా గిల్ గంటన్నరకు పైగా నెట్స్‌‌‌‌లో  బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. 

మొన్నటి వరకూ ఆసీస్‌‌‌‌తో వన్డే, టీ20ల్లో తలపడిన అతను ఇప్పుడు ఫార్మాట్‌‌‌‌ మారడంతో అందుకు తగ్గట్టుగా తన టెక్నిక్స్‌‌‌‌కు పదును పెట్టాడు. గత నెలలో వెస్టిండీస్‌‌‌‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌‌‌‌ను టీమిండియా స్వీప్ చేయగా.. గిల్ ఓ సెంచరీ, ఫిఫ్టీతో సత్తా చాటాడు. అయితే, ఆస్ట్రేలియాతో వన్డే, టీ20ల్లో 8 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో కలిపి ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.

టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న గిల్, వైట్-బాల్ ఫామ్‌‌‌‌ను పక్కనపెట్టి  మళ్లీ రిథమ్‌‌‌‌లోకి వచ్చేందుకు పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. 
మొదట స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌‌‌‌ను ఎదుర్కొని ఎక్కువ గ్రౌండ్ షాట్లు, అప్పుడప్పుడు స్వీప్‌‌‌‌ షాట్స్‌‌‌‌ ఆడాడు.  ఆ తర్వాత పేస్ నెట్స్‌‌‌‌లో బుమ్రా, నితీష్ రెడ్డిల బౌలింగ్‌‌‌‌లో ప్రాక్టీస్ చేశాడు. ఈ ఇద్దరితో పాటు కొందరు లోకల్ బౌలర్లు సీమ్‌‌‌‌ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌తో గిల్‌‌‌‌ను పరీక్షించారు.  

అనంతరం బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో ఎక్కువ బౌన్స్‌‌‌‌, పేస్‌‌‌‌తో కూడిన  త్రోడౌన్‌‌‌‌లను ఎదుర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో రాజస్తాన్ తరపున 67, 156 స్కోర్లు చేసిన యశస్వి జైస్వాల్ కూడా నెట్స్‌‌‌‌లో చాలా సేపు బ్యాటింగ్ చేసి మంచి టచ్‌‌‌‌లో కనిపించాడు.  

సాయి సుదర్శన్  ఫోకస్‌‌‌‌

నెట్స్‌‌‌‌లో ఎక్కువ సమయం గడిపిన మరో బ్యాటర్ సాయి సుదర్శన్. సౌతాఫ్రికా–ఎతో జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో అతను 84 రన్స్‌‌‌‌ మాత్రమే చేశాడు. అయినప్పటికీ, టీమ్ మేనేజ్‌‌‌‌మెంట్ మూడో నంబర్‌‌‌‌‌‌‌‌ కోసం అతడిని పరిగణిస్తున్నా సాయి మాత్రం ఈ స్థానాన్ని ఇంకా పదిలం చేసుకోలేదు. మరోవైపు కీపర్ ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌‌‌‌గా ఆడించవచ్చనే ఊహాగానాలు  వస్తున్నాయి.

జురెల్ తన చివరి ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌‌‌‌ల్లో మూడు సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా–ఎతో ఆదివారం ముగిసిన మ్యాచ్‌‌‌‌ తర్వాత జురెల్‌‌‌‌, -కేఎల్ రాహుల్,  కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఈ ఆప్షనల్ ప్రాక్టీస్‌‌‌‌కు దూరంగా ఉన్నా.. సుదర్శన్ మాత్రం పూర్తి తీవ్రతతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.   

ఈడెన్‌‌‌‌లో రివర్స్‌‌‌‌ స్వింగ్‌‌‌‌..! 

ఆరేండ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్‌‌‌‌లో టెస్ట్ మ్యాచ్ జరగనుండగా అందరి దృష్టి నల్లమట్టితో కూడిన  పిచ్‌‌‌‌పైనే ఉంది. ఈ వికెట్‌‌‌‌పై ఆరంభంలో మంచి బౌన్స్ లభించినా, మ్యాచ్ సాగేకొద్దీ పిచ్ నెమ్మదించి, త్వరగా రఫ్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఫాస్ట్ బౌలర్లకు రివర్స్ స్వింగ్ లభించే చాన్సుంది. ప్రాక్టీస్ తర్వాత కోచ్‌‌‌‌లు గౌతమ్‌‌ గంభీర్, సితాన్షు కోటక్, మోర్కెల్, కెప్టెన్‌‌‌‌ గిల్ పిచ్‌‌‌‌ను పరిశీలించి క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో 15 నిమిషాల పాటు చర్చించారు.

ప్రస్తుతం బ్రౌన్ కలర్‌‌‌‌‌‌‌‌లో ఉండి, అక్కడక్కడ పచ్చికతో కూడిన పిచ్‌‌‌‌పై వాళ్లు పూర్తిగా సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది.  గత 15 ఏండ్లలో కోల్‌‌‌‌కతాలో పేసర్లే 61 శాతం వికెట్లు పడగొట్టారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లటి వాతావరణం కూడా సీమర్లకు అనుకూలించవచ్చు.

దాంతో సఫారీ పేసర్లు  కగిసో రబాడ, మార్కో యాన్సెన్‌‌‌‌తోనే కాకుండా ఇటీవల పాకిస్తాన్‌‌‌‌లో అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా స్పిన్ త్రయం కేశవ్ మహరాజ్, సైమన్ హార్మర్, ముత్తుసామి రూపంలో ఇండియాకు స్పిన్ ముప్పు కూడా పొంచి ఉంది. కాగా, సౌతాఫ్రికా ప్లేయర్లు కూడా ఈడెన్‌‌లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సొంతగడ్డపై ఇండియా స్పిన్ దాడిని ఎదుర్కొనేందుకు ఆ టీమ్ బ్యాటర్లు స్పిన్‌‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నెట్ సెషన్‌‌లో స్పిన్నర్లపై ఎటాకింగ్ షాట్లు ఆడారు.