టీ 20 వరల్డ్‌‌ కప్‌‌లో భారత్ బోణీ

టీ 20 వరల్డ్‌‌ కప్‌‌లో భారత్ బోణీ
  • ఉత్కంఠ పోరులో పాక్​పై ఇండియా గెలుపు
  • చెలరేగిన ​కోహ్లీ.. 
  • పాకిస్తాన్​పై ఇండియా థ్రిల్లింగ్​ విక్టరీ

క్రికెట్ అభిమానులకు దీపావళి పండుగ ఓ రోజు ముందే వచ్చింది. టీ20 ప్రపంచకప్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా మ్యాజిక్ చేసింది. ఆదివారం మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో జరిగిన మ్యాచ్‌‌‌‌లో పాక్‌‌‌‌పై అపురూప విజయం సాధించింది. గత వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఓటమికి బదులు తీర్చుకుంది. తొలుత పాకిస్తాన్‌‌‌‌ 20 ఓవర్లలో 159/8 స్కోరు చేయగా.. తర్వాత ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 31/4తో కష్టాల్లో ఉన్న జట్టును విరాట్‌‌‌‌ కోహ్లీ (53 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 నాటౌట్‌‌‌‌), హార్దిక్‌‌‌‌ పాండ్యా (37 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 2 సిక్సర్లతో 40) పోరాడి గెలిపించారు. కోహ్లీకి ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది. బంతి, బంతికీ టెన్షన్​.. పరుగు, పరుగుకూ ఉత్కంఠ.. ఓవర్‌‌‌‌‌‌, ఓవర్‌‌‌‌కు ఓ సస్పెన్స్‌‌‌‌.. రెప్పవాల్చలేని క్షణాలు.. ఊపిరి సలపని సన్నివేశాలతో.. యావత్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ప్రపంచం మునివేళ్లపై నిలబడి.. ఆతృతగా, ఆసక్తిగా ఎదురుచూసిన హై ఓల్టేజ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా ‘ఛేజ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌’ కింగ్‌‌‌‌ కోహ్లీ (53 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 నాటౌట్‌‌‌‌) విజయ గర్జన చేశాడు..! ఆఖరి బాల్‌‌‌‌ వరకు అత్యంత థ్రిల్లింగ్‌‌‌‌గా సాగిన మెగా పోరులో టీమిండియాకు అదిరిపోయే విజయాన్ని అందించాడు..! ప్రపంచం మెచ్చిన పాక్‌‌‌‌ పేసర్లను పరేషాన్‌‌‌‌ చేస్తూ.. మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో తిరుగులేని మొనగాడిగా నిలిచాడు..! ఫలితంగా దాయాది జట్టుపై ఘనమైన ప్రతీకారం తీర్చుకున్న రోహిత్‌‌‌‌సేన.. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో బోణీ చేయడంతో పాటు ఓ రోజు ముందుగానే దేశానికి దీపావళిని తీసుకొచ్చింది..!!

మెల్‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌: అంచనాలను అందుకుంటూ.. వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ తనను ఎందుకు కీర్తిస్తుందో మళ్లీ నిరూపించుకుంటూ.. తనకు మాత్రమే సాధ్యమైన ఛేజింగ్‌‌‌‌ సూత్రాన్ని మరోసారి పక్కగా అమలు చేసిన విరాట్‌‌‌‌ కోహ్లీ.. ఆస్ట్రేలియా గడ్డపై, అచ్చొచ్చిన ప్రత్యర్థి మీద చెలరేగిపోయాడు. హార్దిక్‌‌‌‌ పాండ్యా (37 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 2 సిక్సర్లతో 40; 3/30) అండతో పాకిస్తాన్‌‌‌‌పై ఓ అద్భుత విజయాన్ని సృష్టించాడు. ఫలితంగా టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ సూపర్‌‌‌‌–12 గ్రూప్‌‌‌‌–2లో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌ను ఓడించింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాకిస్తాన్‌‌‌‌ 20 ఓవర్లలో 159/8 స్కోరు చేసింది. షాన్‌‌‌‌ మసూద్‌‌‌‌ (42 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 52 నాటౌట్‌‌‌‌), ఇఫ్తికార్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51) హాఫ్‌‌‌‌ సెంచరీలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 160/6 స్కోరు చేసింది. దాదాపు 13 ఓవర్లు క్రీజులో ఉన్న కోహ్లీ–-పాండ్యా ఐదో వికెట్‌‌‌‌కు 113 రన్స్‌‌‌‌ జోడించి ఇండియాను నిలబెట్టారు. కోహ్లీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ జోరు..

సరిగ్గా 364 రోజుల కిందట యూఏఈ (టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌)లో బాబర్‌‌‌‌, రిజ్వాన్‌‌‌‌ చేసిన ఎదురుదాడిని గుర్తుంచుకున్న ఇండియన్‌‌‌‌ బౌలర్లు ఎంసీజీలో వారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. పిచ్‌‌‌‌పై తేమను సద్వినియోగం చేసుకుంటూ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (3/32) ఇన్, ఔట్‌‌‌‌ స్వింగ్‌‌‌‌తో  నిప్పులు కురిపించాడు. మధ్యలో పాండ్యా,  భువనేశ్వర్‌‌‌‌ (1/22), షమీ (1/25) అండగా నిలవడంతో పాక్‌‌‌‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. తన ఫస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో తొలి బాల్‌‌‌‌కు బాబర్‌‌‌‌ (0)ను.. తర్వాతి ఓవర్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు రిజ్వాన్‌‌‌‌ (4)ను పెవిలియన్‌‌‌‌కు పంపి అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌.. డ్రీమ్‌‌‌‌ స్పెల్‌‌‌‌తో మెగా టోర్నీని మొదలుపెట్టాడు. 15 రన్స్‌‌‌‌కే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌‌‌‌ను మసూద్‌‌‌‌, ఇఫ్తికార్‌‌‌‌ ఆదుకున్నారు. స్పిన్నర్లు అక్షర్‌‌‌‌, అశ్విన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో ఎదురుదాడి చేస్తూ రన్‌‌‌‌రేట్‌‌‌‌ను కాపాడారు. ఈ క్రమంలో మూడో వికెట్‌‌‌‌కు 76 రన్స్‌‌‌‌ జోడించి ఇఫ్తికార్‌‌‌‌ ఔటయ్యాడు. ఈ దశలో పాండ్యా జోరందుకోవడంతో.. షాదాబ్‌‌‌‌ (5), హైదర్‌‌‌‌ అలీ (2), నవాజ్‌‌‌‌ (9), అసిఫ్ అలీ (2) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. చివర్లో ఆఫ్రిది (16), మసూద్‌‌‌‌కు అండగా నిలవడంతో ఎనిమిదో వికెట్‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌ జతకావడంతో పాక్‌‌‌‌ మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. 

31/4తో కష్టాలు..

పాక్‌‌‌‌ పేసర్లు లైన్‌‌‌‌ అండ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌కు కట్టుబడటంతో ఛేజింగ్‌‌‌‌లో ఇండియా ఓపెనర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో 4 ఓవర్లు కూడా ముగియకముందే రాహుల్‌‌‌‌ (4), రోహిత్‌‌‌‌ (4) పెవిలియన్‌‌‌‌కు చేరారు. ఇన్నింగ్స్‌‌‌‌ను ఆదుకునే బాధ్యతను తీసుకున్న కోహ్లీ బ్యాటింగ్‌‌‌‌ షో చూపెట్టాడు. ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు స్ట్రయిట్‌‌‌‌ బౌండ్రీతో ఖాతా తెరిచిన సూర్య కుమార్‌‌‌‌ (15) ఆరో ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. ఫించ్‌‌‌‌ హిట్టర్‌‌‌‌గా వచ్చిన అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (2) ఏడో ఓవర్‌‌‌‌లో ఔట్‌‌‌‌ కావడంతో ఇండియా 31/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో  కోహ్లీకి పాండ్యా సపోర్ట్​ ఇచ్చాడు. పాక్‌‌‌‌ బౌలర్లు కవ్వించే బంతులు వేసినా.. ఎంసీజీ గ్రౌండ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ–పాండ్యా  సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌కే ప్రయత్నించారు. దీంతో పవర్‌‌‌‌ప్లేలో 31/3 ఉన్న స్కోరు తొలి 10 ఓవర్లలో 45/4కు మాత్రమే చేరింది. 11వ ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చిన హార్దిక్‌‌‌‌ 12వ ఓవర్‌‌‌‌లో రెండు సిక్సర్లతో జోరు పెంచాడు. ఇదే ఓవర్‌‌‌‌లో విరాట్‌‌‌‌ కూడా సిక్సర్‌‌‌‌ బాదడంతో 20 రన్స్‌‌‌‌ వచ్చాయి. ఇక్కడి నుంచి ఓవర్‌‌‌‌కు ఓ ఫోర్‌‌‌‌ ఉండేలా జాగ్రత్త పడటంతో రన్‌‌‌‌రేట్‌‌‌‌ క్రమంగా మెరుగైంది. ఫలితంగా 17 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోరు 112/4కు చేరినా ఆసలు ఆట, డ్రామా మాత్రం ఆఖరి మూడు ఓవర్లలోనే జరిగింది. 

ఆఖరి ఓవర్ లో హైడ్రామా

రెండు ఎక్స్‌‌ట్రాలు, రెండు వికెట్లతో లాస్ట్‌‌ ఓవర్‌‌ సస్పెన్స్‌‌ సినిమా థ్రిల్లర్‌‌ను తలపించింది. విజయానికి 6 బాల్స్‌‌లో 16 రన్స్‌‌ అవసరం కాగా స్పిన్నర్​ నవాజ్‌‌ (2/42) వేసిన తొలి బాల్‌‌కే పాండ్యా ఔటయ్యాడు. లెగ్‌‌ సైడ్‌‌ బాల్‌‌ను స్లాగ్‌‌ చేయబోయి కవర్‌‌ పాయింట్‌‌లో బాబర్‌‌ చేతికి చిక్కాడు. సూపర్‌‌ ఫినిషర్‌‌ కార్తీక్‌‌ (1)ఉన్నాడన్న ఆశతో ఫ్యాన్స్‌‌ ఊపిరి బిగపట్టారు. తర్వాతి రెండు బాల్స్‌‌కు ఓ సింగిల్‌‌, డబుల్‌‌ (కోహ్లీ) రావడంతో విజయ సమీకరణం 3 బాల్స్‌‌లో 13గా మారింది.  టీమ్​మేట్స్​ సలహాలు విన్న నవాజ్‌‌.. నాలుగో బాల్‌‌ను హై ఫుల్‌‌టాస్‌‌ వేస్తే కోహ్లీ జబర్దస్త్‌‌ సిక్సర్‌‌ కొట్టాడు. అంపైర్‌‌ నో బాల్‌‌ ఇవ్వడంతో 7 రన్స్‌‌ వచ్చాయి.  తీవ్ర ఒత్తిడిలో నవాజ్‌‌ ఓ వైడ్‌‌గా వేయడంతో సమీకరణం 3 బాల్స్‌‌లో 5 రన్స్‌‌గా మారింది. ఫోర్త్‌‌ బాల్‌‌ (ఫ్రీ హిట్‌‌) డైరెక్ట్‌‌గా కోహ్లీ వికెట్లను తాకి పక్కకుపోవడంతో మూడు రన్స్‌‌ తీశాడు. ఇక ఐదో బాల్‌‌కు కార్తీక్‌‌ స్టంపౌట్‌‌ కావడంతో లాస్ట్​ బాల్‌‌కు 2 రన్స్‌‌ అవసరమయ్యాయి. పరేషాన్‌‌లో పడిన నవాజ్‌‌... ఆరో బాల్‌‌ను వైడ్‌‌గా వేయడంతో స్కోర్లు ఈక్వల్‌‌ అయ్యాయి. చివరి బాల్‌‌కు అశ్విన్‌‌ (1 నాటౌట్‌‌) రన్‌‌ తీయడంతో ఇండియా విజయ సంబరాలు మొదలయ్యాయి.

‘కింగ్‌‌‌‌’లా కోహ్లీ..

గ్రౌండ్‌‌‌‌లో ఉన్న 90వేల మందితో పాటు టీవీల్లో చూసిన కోట్లాది మంది అభిమానులు మునికాళ్లపై నిలబడిన సన్నివేశాలు, ఊపిరి బిగపట్టిన క్షణాలకు ఈ మూడు ఓవర్లలో లెక్కేలేదు. ఇండియా గెలవాలంటే 18 బాల్స్‌‌‌‌లో 48 రన్స్‌‌‌‌ కావాలి. క్రీజులో కోహ్లీ, పాండ్యా ఉన్నా.. ఎదురుగా షాహీన్‌‌‌‌ ఆఫ్రిది బౌలింగ్‌‌‌‌కు రావడంతో ఆందోళన అయితే మొదలైంది. కానీ ఇక్కడే కోహ్లీ తనను ‘ఛేజ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌’ అని ఎందుకంటారో మరోసారి నిరూపించుకున్నాడు. ఆఫ్రిది ఎంత తెలివిగా బాల్స్‌‌‌‌ వేసినా.. ఒకటి, మూడు, ఆరో బాల్‌‌‌‌ను బౌండ్రీకి తరలించడంతో 17 రన్స్‌‌‌‌ వచ్చాయి. ఫలితంగా సమీకరణం 12 బాల్స్‌‌‌‌లో 31 రన్స్‌‌‌‌గా మారింది. ఈ దశలో 19వ ఓవర్లో రవూఫ్‌‌‌‌ (2/36) తొలి 4 బాల్స్‌‌‌‌కు మూడే రన్స్‌‌‌‌ ఇచ్చి ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లాడు. అయితే  మళ్లీ కోహ్లీ ఇక్కడా తన మార్క్‌‌‌‌ను చూపెట్టాడు. ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌తో వేసిన ఐదో బాల్‌‌‌‌ను బౌలర్‌‌‌‌ లాంగాన్​లో స్టాండ్స్‌‌‌‌లోకి, లెగ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ మీద పడిన తర్వాతి బాల్‌‌‌‌ను రిస్ట్‌‌‌‌తో ఫ్లిక్‌‌‌‌ చేస్తూ ఫైన్‌‌‌‌ లెగ్‌‌‌‌లో సూపర్‌‌‌‌ సిక్సర్‌‌‌‌గా మలిచాడు. అంతే ఎంసీజీ.. ‘కింగ్‌‌‌‌ కోహ్లీ’ అంటూ మార్మోమోగిపోయింది. 

స్కోరు బోర్డు

పాకిస్తాన్‌‌‌‌: రిజ్వాన్‌‌ (సి) భువనేశ్వర్‌‌ (బి) అర్ష్‌‌దీప్‌‌ 4, బాబర్‌‌ (ఎల్బీ) అర్ష్‌‌దీప్‌‌ 0, మసూద్‌‌ (నాటౌట్‌‌) 52, ఇఫ్తికార్‌‌ (ఎల్బీ) (బి) షమీ 51, షాదాబ్‌‌ (సి) సూర్య (బి) పాండ్యా 5, హైదర్‌‌ (సి) సూర్య (బి) పాండ్యా 2, నవాజ్‌‌ (సి) కార్తీక్‌‌ (బి) పాండ్యా 9, ఆసిఫ్‌‌ (సి) కార్తీక్‌‌ (బి) అర్ష్‌‌దీప్‌‌ 2, షాహీన్‌‌ (సి అండ్‌‌ బి) భువనేశ్వర్‌‌ 16, రవూఫ్‌‌ (నాటౌట్‌‌) 6, ఎక్స్‌‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 159/8. వికెట్లపతనం: 1–1, 2–15, 3–91, 4–96, 5–98, 6–115, 7–120, 8–151. బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌ 4–0–22–1, అర్ష్‌‌దీప్‌‌ 4–0–32–3, షమీ 4–0–25–1, పాండ్యా 4–0–30–3, అశ్విన్‌‌ 3–0–23–0, అక్షర్‌‌ 1–0–21–0. 

ఇండియా: రాహుల్‌‌ (బి) నసీమ్‌‌ 4, రోహిత్‌‌ (సి) ఇఫ్తికార్‌‌ (బి) రవూఫ్‌‌ 4, కోహ్లీ (నాటౌట్‌‌) 82, సూర్యకుమార్‌‌ (సి) రిజ్వాన్‌‌ (బి) రవూఫ్‌‌ 15, అక్షర్‌‌ (రనౌట్‌‌) 2, పాండ్యా (సి) బాబర్‌‌ (బి) నవాజ్‌‌ 40, దినేశ్‌‌ (స్టంప్డ్​) రిజ్వాన్‌‌ (బి) నవాజ్‌‌ 1, అశ్విన్‌‌ (నాటౌట్‌‌) 1, ఎక్స్‌‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 160/6. వికెట్లపతనం: 1–7, 2–10, 3–26, 4–31, 5–144, 6–158. బౌలింగ్‌‌: షాహీన్‌‌ 4–0–34–0, నసీమ్‌‌ షా 4–0–23–1, రవూఫ్‌‌ 4–0–36–2, షాదాబ్‌‌ 4–0–21–0. నవాజ్‌‌ 4–0–42–2.
ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్‌‌ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌‌గా కోహ్లీ (24) రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్‌‌ (23) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇంటర్నేషనల్‌‌ టీ20ల్లో అత్యధిక రన్స్‌‌ చేసిన ప్లేయర్‌‌గా కోహ్లీ (3794) నిలి చాడు. తద్వారా రోహిత్‌‌ (3741) రికార్డును అధిగమించాడు. 

ఇండియాకే బెస్ట్​ ఇన్నింగ్స్​

హ్యాట్సాఫ్‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌. ఇది అతనికి మాత్రమే కాదు ఇండియాకే బెస్ట్​ ఇన్నింగ్స్​. విరాట్​ ఆట గురించి చెప్పేందుకు నాకు మాటలు రావడం లేదు. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే  పరిస్థితులు మారతాయని తెలుసు. కోహ్లీ, పాండ్యా అదే చేసి చూపించారు. ఈ ఇద్దరి పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌నే మార్చేసింది. మా బౌలింగ్‌‌‌‌ కూడా సూపర్​గా ఉంది. మధ్యలో పాక్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ బాగా చేసింది. ఈ పిచ్‌‌‌‌పై టార్గెట్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ ఈజీ కాదని తెలుసు. అయినా కోహ్లీ, హార్దిక్‌‌‌‌ తమ అనుభవంతో పరిస్థితులకు తగ్గట్టు ఆడి గెలిపించారు. ‑ రోహిత్‌‌‌‌ శర్మ        

ఈ విజయంతో దీపావళికి ప్రజల జీవితంలో  కోహ్లీ మరింత ఆనందాన్ని నింపాడు. ఎన్నో కఠినమైన పరిస్థితుల తర్వాత తన నుంచి వచ్చిన బెస్ట్​ ఇన్నింగ్స్‌ ఇది. నా లైఫ్​లో చూసిన బెస్ట్​ ఇన్నింగ్స్‌ కూడా ఇదే. దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఏదో రోజు తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడని మా పాప తెలుసుకుంటుంది ‑ అనుష్క

కోహ్లీ.. నీ లైఫ్‌లో ఇది నిస్సందేహంగా బెస్ట్‌ ఇన్నింగ్స్. నీ ఆట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. 19వ ఓవర్‌లో రవూఫ్‌ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌పై  లాంగాన్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌ అద్భుతం. ‑ సచిన్‌