కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..రెండో వన్డేలో లంకపై విక్టరీ

కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..రెండో వన్డేలో లంకపై విక్టరీ

శ్రీలంతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 216 పరుగుల టార్గెట్ను టీమిండియా 43.2 ఓవర్లలో ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-0తో గెలుచుకుంది. లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ 103 బంతుల్లో 64 పరుగులు చేయగా..హార్దిక్ పాండ్యా 36 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేసి అతనికి సహకరించారు. 

టాపార్డర్ విఫలం..

216 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా అదిలోనే వికెట్ కోల్పోయింది. 33 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ(17) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే గిల్ (21) పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో 20 పరుగుల వ్యవధిలో తొలి వన్డే సెంచరీ హీరో కోహ్లీ ఔటయ్యాడు. కేవలం 4 పరుగులకే చేసిన కోహ్లీ లహిరు కుమారా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.  మరి కొద్దిసేపటికే భారత్ ఇంకో వికెట్ నష్టపోయింది. 86 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (28) కసున్ రజిత బౌలింగ్లో lbwగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 86 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఆదుకున్న రాహుల్, పాండ్యా..

టాపార్డర్ విఫలం కావడంతో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు.  చెత్త బంతులను బౌండరీలు మలుస్తూ..సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును నడిపించారు. ఇదే క్రమంలో   ఐదో వికెట్‌కు వీరిద్దరు  97 బంతుల్లో 60 ప‌రుగులు జోడించారు.

ఈ సమయంలో వీరి జోడిని  చమిక కరుణరత్నే విడదీశాడు. 36 పరుగులు చేసిన పాండ్యాను పెవలియన్ చేర్చాడు. పాండ్యా ఔటైనా..కేఎల్ రాహుల్  టీమిండియాను గెలిపించే బాధ్యత భుజాన వేసుకున్నాడు. అక్షర్ పటేల్తో  కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే 21 పరుగుల చేసిన అక్షర్ 191 రన్స్ వద్ద ఔటయ్యాడు. అక్షర్ ఔటైనా..రాహుల్ తన జోరును కొనసాగించాడు.  ఇదే క్రమంలో 93 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ సహకారంతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లలో లహిరు కుమార, చమిక కరుణరత్నే చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కసున్ రజిత, ధనంజయ డి సిల్వ తలా ఓ వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక  215 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు 29 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో కుశాల్ మెండీస్,ఫెర్నాండో  జట్టును ఆదుకున్నారు. ఇదే క్రమంలో ఫెర్నాండో  హాఫ్ సెంచరీ సాధించగా..కుశాల్ మెండీస్ 34 పరుగులు చేశాడు. అయితే ఈ సమయంలో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. ఓ దశలో ఒక వికెట్ నష్టానికి 102 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న లంకేయులను కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టాడు. కుషాల్ మెండీస్ను LBWగా ఔట్ చేశాడు. ఆ తర్వాత  మరో పరుగు వ్యవధిలో శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. ధనంజయ డి సిల్వను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. 118 పరుగుల వద్ద ఫెర్నాండో రనౌట్ అయ్యాడు. మరికొద్ది సేపటి తర్వాత లంక కెప్టెన్ దసున్ శనకను  కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. మరో పరుగు వ్యవధిలో కుల్దీప్ మరోసారి మాయ చేసి అసలంకను పెవీలియన్ చేర్చడంతో..శ్రీలంక 24 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక 152 పరుగుల వద్ద లంకను ఉమ్రాన్ మాలిక్ దెబ్బకొట్టాడు. హసరంగను ఔట్ చేయడంతో..లంక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. 

ఈ సమయంలో చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత లంకను ఆదుకున్నారు. ముఖ్యంగా దునిత్ 34 బంతుల్లో 32 పరుగులు చేయగా..కరుణ రత్నే, రజిత 17 పరుగులు చొప్పున  చేసి రాణించారు. చివర్లో మహ్మద్ సిరాజ్ బుల్లెట్ బంతులో లంకేయులను వణికించాడు. 215 పరుగుల వద్ద వెల్లలాగే, లహిరు కుమారను ఔట్ చేయడంతో శ్రీలంక కేవలం 39.4 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు దక్కించుకోగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.