జైత్రయాత్రకు బ్రేక్‌

జైత్రయాత్రకు బ్రేక్‌
  • 12 వరుస విజయాల తర్వాత ఇండియా ఓటమి
  • తొలి టీ20లో సౌతాఫ్రికా గెలుపు 
  • చెలరేగిన మిల్లర్‌, డుసెన్‌
  • మెరిసిన ఇషాన్‌.. ముంచిన బౌలర్లు

న్యూఢిల్లీ : టీ20 ఫార్మాట్‌‌లో ఏడు నెలలుగా ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా జైత్రయాత్రకు  బ్రేక్‌‌ పడింది. వరుసగా 13వ విజయంతో వరల్డ్‌‌ రికార్డు కొట్టాలని ఆశించిన మన జోరుకు సౌతాఫ్రికా కళ్లెం వేసింది. ఇషాన్‌‌ కిషన్ (48 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76) మెరుపులతో భారీ స్కోరు చేసినా  బౌలింగ్‌‌ వైఫల్యంతో 12 విజయాల తర్వాత టీమిండియా తొలి ఓటమి ఎదుర్కొంది. కెప్టెన్‌‌గా తొలి పోరులో రిషబ్‌‌ పంత్‌‌కు నిరాశే మిగిలింది.  వాండర్‌‌ డుసెన్‌‌ (46 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 నాటౌట్‌‌), డేవిడ్‌‌ మిల్లర్‌‌ (31 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 నాటౌట్) దంచికొట్టడంతో 212 పరుగుల భారీ టార్గెట్‌‌ను ఈజీగా ఛేజ్ చేసిన సపారీ టీమ్‌‌ గురువారం జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌‌లో మొదట ఇండియా 211/4 స్కోరు చేసింది. అనంతరం డుసెన్‌‌, మిల్లర్‌‌ నాలుగో వికెట్‌‌కు 64 బాల్స్‌‌లోనే 131 రన్స్‌‌ రాబట్టడంతో సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 212/3 స్కోరు చేసి గెలిచింది. ఇండియా బౌలర్లలో భువనేశ్వర్‌‌ (1/43), హర్షల్‌‌ పటేల్‌‌ (1/43), అక్షర్‌‌పటేల్‌‌(1/40) నిరాశ పరిచారు.మిల్లర్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.  ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం కటక్‌‌లో జరుగుతుంది. 

ఇషాన్‌‌ ధనాధన్‌‌
ఐపీఎల్‌‌లో నిరాశ పరిచిన యంగ్‌‌ ఓపెనర్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ పవర్​ ఫుల్‌‌ షాట్లతో విజృంభించాడు.. మిగతా బ్యాటర్లు కూడా మెరుపు బ్యాటింగ్‌‌తో తలో చేయి వేయడంతో ఇండియా భారీ స్కోరు చేసింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియాకు కొత్త ఓపెనింగ్‌‌ జోడీ ఇషాన్‌‌–రుతురాజ్‌‌ (23) తొలి వికెట్​కు 57 రన్స్​ జోడించి మంచి ఆరంభం ఇచ్చింది.  ఏడో ఓవర్లో రుతురాజ్​ను ఔట్​ చేసిన ప్రిటోరిస్‌‌  ఈ జోడీని విడదీసినా.. ఇషాన్‌‌కు తోడైన శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (36)  కూడా దంచాడు. షంసి వేసిన పదో ఓవర్లో అతను రెండు సిక్సర్లతో  స్కోరు వంద దాటించాడు. మహారాజ్‌‌ బౌలింగ్‌‌లో సిక్స్‌‌ కొట్టిన ఇషాన్‌‌ 37 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆపై, తను టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చేశాడు. మహారాజ్‌‌ తర్వాతి ఓవర్లో 6, 6, 4, 4తో రెచ్చిపోయిన ఇషాన్‌‌ ఆఖరి బాల్‌‌కు స్టబ్స్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వగా 13 ఓవర్లకు ఇండియా 137/2తో పటిష్ట స్థితిలో  నిలిచింది. ఈ దశలో మూడు ఓవర్ల పాటు ఆతిథ్య జట్టును సఫారీ బౌలర్లు కట్టడి చేశారు. 17వ ఓవర్‌‌ తొలి బాల్‌‌కే శ్రేయస్‌‌ను ప్రిటోరియస్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన కొత్త కెప్టెన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ (29) స్పీడు పెంచగా,  రీఎంట్రీలో  హార్దిక్‌‌ పాండ్యా (12 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 నాటౌట్‌‌)  తన ఐపీఎల్‌‌ ఫామ్‌‌ను కొనసాగిస్తూ భారీ షాట్లు  బాదడంతో 19 ఓవర్లకే స్కోరు 200 దాటింది. ఆఖరి ఓవర్‌‌ తొలి బాల్‌‌కే అన్రిచ్‌‌.. పంత్‌‌ను ఔట్‌‌ చేయగా.. 6, 2తో పాండ్యా ఇన్నింగ్స్‌‌ను ముగించాడు. టీ20ల్లో సౌతాఫ్రికాకు ఇదే హయ్యెస్ట్​ ఛేజింగ్. సౌతాఫ్రికా బ్యాటర్‌‌ మార్‌‌క్రమ్‌‌ కరోనా పాజిటివ్‌‌గా తేలడంతో సిరీస్‌‌ మొత్తానికి దూరమయ్యాడు.

డేవిడ్‌‌, డుసెన్‌‌ దంచుడే దంచుడు
డేవిడ్​ మిల్లర్‌‌, డుసెన్‌‌ దంచికొట్టడంతో భారీ టార్గెట్‌‌ను సౌతాఫ్రికా సులభంగా కరిగించింది. మూడో ఓవర్లోనే  కెప్టెన్​ బవూమ (10)ను భువనేశ్వర్‌‌ ఔట్‌‌ చేసి బ్రేక్‌‌ ఇచ్చినా.. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ డ్వేన్‌‌ ప్రిటోరియస్‌‌ (29) భారీ షాట్లు కొట్టడంతో  ఐదు ఓవర్లకే సఫారీల స్కోరు 60 దాటింది. అయితే, ఆరో ఓవర్లో అతడిని హర్షల్‌‌ బౌల్డ్‌‌ చేయగా.. తొమ్మిదో ఓవర్లో డికాక్‌‌(22)ను అక్షర్‌‌ పెవిలియన్‌‌ చేర్చాడు. తర్వాతి 12 బాల్స్​లో ఒక్క బౌండ్రీ ఇవ్వకపోవడంతో సఫారీ టీమ్‌‌ 11 ఓవర్లలో 92/3తో నిలిచింది. 54 బాల్స్​లో ఆ టీమ్​కు 120 రన్స్​ అవసరం అవగా.. ఇండియాకే ఎక్కువ అవకాశాలు కనిపించాయి. కానీ, ఐపీఎల్‌‌లో అదరగొట్టిన మిల్లర్‌‌ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. హర్షల్‌‌ బౌలింగ్‌‌లో 4,6 కొట్టిన అతను.. అక్షర్‌‌ పటేల్‌‌ వేసిన 13వ ఓవర్లో 4, 6, 6 బాది సఫారీలను రేసులోకి తెచ్చి ఇండియా బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఇక, అప్పటిదాకా స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసిన డుసెన్‌‌ .. హర్షల్‌‌ వేసిన 17వ ఓవర్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్‌‌తో 22 రన్స్‌‌ పిండుకొని మ్యాచ్‌‌ను తమవైపు లాగేసుకున్నాడు. చివరి 18 బాల్స్‌‌లో ఆ టీమ్‌‌కు 34 రన్స్‌‌ అవసరం అవగా.. భువీ వేసిన 18వ ఓవర్లో మిల్లర్‌‌ సిక్స్‌‌ కొట్టగా.. డుసెన్‌‌ వరుసగా 6,4,4తో ఇండియా ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. 29 రన్స్‌‌ వద్ద డుసెన్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను శ్రేయస్‌‌ డ్రాప్‌‌ చేయడం ఇండియా  కొంప ముంచింది.  

సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 211/4 (ఇషాన్‌‌‌‌ 76, శ్రేయస్‌‌ 36,పార్నెల్‌‌ 1/32)
సౌతాఫ్రికా: 19.1 ఓవర్లలో 212/3  (డుసెన్‌‌ 75* , మిల్లర్‌‌ 64*, అక్షర్​ 1/40).