చితక్కొట్టిన సూర్య.. టీమిండియా విజయం

చితక్కొట్టిన సూర్య.. టీమిండియా విజయం

టీ20 వరల్డ్ కప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన..రెండో మ్యాచ్లో పసికూన నెదర్లాండ్స్ను 56 పరుగుల తేడాతో ఓడించింది. 180 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్..భారత బౌలర్ల ధాటికి కేవలం 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేయగలిగింది. 

రాహుల్ విఫలం

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే  అందరూ ఆశించినట్టుగా టీమిండియాకు సరైన ఆరంభం దక్కలేదు. ఆరంభంలోనే భారత్ వికెట్ కోల్పోయింది. మరోసారి నిరాశపరుస్తూ..కేఎల్ రాహుల్..మూడో ఓవర్‌లోనే ఔటయ్యాడు. 9 పరుగులు చేసిన రాహుల్...మీకరెన్ బౌలింగ్లో LBWగా వెనుదిరిగాడు. 

రోహిత్  హాఫ్ సెంచరీ..

రాహుల్ ఔటైనా..కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పాక్పై పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ రోహిత్..ఈ మ్యాచ్లో మంచి టచ్లో కనిపించాడు. సిక్సులు, ఫోర్లతో అదరగొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్..ఫ్రెడ్ క్లాస్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో టీమిండియా 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 

సూర్య, కోహ్లీ కేక..

రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కోహ్లీతో కలిసి ఎడా పెడా బౌండరీలు బాదాడు. అటు కోహ్లీ సైతం సూర్య అండతో రెచ్చిపోయాడు. ఇదే క్రమంలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. 44 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. అటు సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు చేయడంతో చివరకు భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 179 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ మాత్రమే ఒక్కో వికెట్ పడగొట్టారు.

తడబడిన నెదర్లాండ్స్..

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేయగలిగింది.  నెదర్లాండ్స్ ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్ 1, మ్యాక్స్ ఒడౌడ్ 16, బాస్ డీ లీడె 16 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కొలిన్ అక్కెర్‌మన్ 17, టామ్ కూపర్ 9 పరుగులకే పెవిలియన్ కు చేరారు. చివర్లో ప్రింగల్, షారీజ్ అహ్మద్ కొద్దిసేపు బ్యాట్ ఝుళిపించినా ఫలితం లేకుండా పోయింది.  టీమిండియా బౌలర్లలో  భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, అశ్విన్  తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. షమీ ఒక వికెట్ పడగొట్టాడు.  తక్కువ బంతుల్లో సూపర్ హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.