
- అమెరికా మంత్రి హొవార్డ్ లుట్నిక్ వెల్లడి
న్యూయార్క్: హెచ్1బీ వీసాలపై అమెరికా మరో బాంబు పేల్చింది. ఇప్పటికే ఈ వీసా ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్ల(దాదాపు 90లక్షలు)కు ట్రంప్సర్కారు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వీసా జారీ ప్రక్రియపై ఆ దేశ వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఫిబ్రవరికి ముందే హెచ్1 బీ వీసాల్లో భారీ మార్పులుంటాయని తెలిపారు.
పాత విధానంలో లోపాలున్నాయని వెల్లడించారు. హెచ్1 బీ వీసాలపై ట్రంప్ సర్కారు రుసుము పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై లుట్నిక్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘ఈ ప్రక్రియ ఫిబ్రవరి 2026 నుంచి అమల్లోకి వస్తుంది. నా అంచనా ప్రకారం 2026లో గణనీయమైన మార్పులు ఉంటాయి” అని తెలిపారు. లక్ష డాలర్ల ఫీజుతో రాబోయే రోజుల్లో ఆ వీసాపై వచ్చే వారి సంఖ్యలో కూడా మార్పు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
లాటరీ పద్ధతిని మార్చాల్సిందే..
హెచ్1 బీ జారీకి పాత విధానాన్నే పాటించడంవల్ల దేశంలోకి నైపుణ్యంలేని టెక్ కన్సల్టెన్సీలు కుటుంబాలతోసహా వచ్చేస్తున్నారని లుట్నిక్ వ్యాఖ్యానించారు. అందుకే లాటరీ విధానంలో కూడా మార్పులు ఉండాల్సిందేనని అన్నారు. ఇప్పటికీ ఒక దేశం లాటరీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నించారు.
హెచ్1 బీ ప్రాసెస్‌ను 1990లో రూపొందించారని, ఇప్పటివరకూ అదే ప్రక్రియను పాటిస్తుండడంతో వీసాలు 710 రెట్లు అధిక సబ్స్క్రైబ్అయ్యాయని చెప్పారు. ఇందులో 74% టెక్ కన్సల్టెన్సీలేనని తెలిపారు. 4 శాతం మంది మాత్రమే విద్యావేత్తలు, డాక్టర్స్ ఉన్నారని చెప్పారు.
అందుకే ఈ ప్రక్రియలోనే మార్పు రావాలని అన్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులకే అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను ఇవ్వాలని తెలిపారు. దేశంలోకి ఉన్నత డిగ్రీలు పొందిన వైద్యులు, విద్యావేత్తలు రావాలని అన్నారు.