ఆర్మీ క్యాప్స్ తో టీమిండియా : మ్యాచ్ ఫీజు విరాళం

ఆర్మీ క్యాప్స్ తో టీమిండియా : మ్యాచ్ ఫీజు విరాళం

రాంచీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో మ్యాచ్ సందర్భంగా టీమిండియా జట్టు దేశభక్తిని చాటుకుంది. ఇవాళ ప్రత్యేకంగా ఆర్మీ క్యాప్స్ ధరించింది. మ్యాచ్ జరగడానికి ముందు భారత జట్టు ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ క్యాప్స్ ను అందించాడు. ఆ టోపీలను పెట్టుకున్న ఆటగాళ్లు… ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. ఇవాళ్టి మ్యాచ్ ఫీజును ఆటగాళ్లు జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. అమరుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని సందేశం ఇచ్చారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీకి నిధులు సమకూర్చేలా.. జట్టు ఆటగాళ్లంతా ఆర్మీ క్యాప్స్ ధరించాలని ధోనీ , కోహ్లీ నిర్ణయించినట్టు  టీమ్ తెలిపింది. 2011లో మహేంద్రసింగ్ ధోనీకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ను అందించింది ఇండియన్ ఆర్మీ.

ప్రత్యేకంగా రూపొందించిన క్యాప్స్ ధరించి.. మీడియాతో మాట్లాడాడు స్కిప్పర్ విరాట్ కోహ్లీ. ఆటగాళ్లు, టీమ్ కు సంబంధించిన ఇవాళ్టి మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. అమరుల కుటుంబసభ్యులను ఆర్థికంగా ఆదుకునేందుకు, వారి పిల్లలను చదివించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.జాతీయ రక్షణ నిధికి విరాళాలు సేకరించే లక్ష్యంతో టీమిండియా స్పెషల్ గా ఆర్మీ క్యాప్స్ ధరించడం ఆనందంగా ఉందని చెప్పాడు.