పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నయ్!

పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నయ్!
  • తాజాగా ఎంపీడీవో ఆఫీస్​లో గుండెపోటుతో ఒకరి మృతి
  • వర్క్ ప్రెజర్​ వల్లే హార్ట్ ఎటాక్ అంటున్న బాధితులు
  • జాబ్​ చార్టులో లేని పనులూ చేయిస్తున్నారని ఆవేదన

ఖమ్మం, వెలుగు: ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్ లు పని ఒత్తిడికి గురవుతున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మల్లు సీతారామయ్య (55) హార్ట్ ఎటాక్​ తో మంగళవారం సాయంత్రం చనిపోయాడు. రఘునాథపాలెం ఎంపీడీఓ ఆఫీస్​లో రివ్యూ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. తనకు శ్వాస ఆడడం లేదని, ఛాతిలో నొప్పిగా ఉందని అంటూ చైర్​ లోనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆఫీస్​ సిబ్బంది 108కు కాల్ చేశారు. అంబులెన్స్​ రావడం ఆలస్యమవుతుండడంతో అక్కడ అందుబాటులో ఉన్న కారులో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈలోగానే సీతారామయ్య చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో సీతారామయ్య చనిపోగా  బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రివ్యూ మీటింగ్ లో అధికారులు పరుషంగా మాట్లాడడం, పని సరిగా చేయడం లేదని సీతారామయ్యను మందలించడం వల్లనే ఆయనకు హార్ట్ ఎటాక్​ వచ్చిందని తోటి టెక్నికల్ అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. అధికారుల వేధింపులు తట్టుకోలేక, పనిభారం మోయలేక చనిపోయాడని, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, సీతారామయ్య ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గౌతమ్​కు వినతిపత్రం అందజేశారు. 

ఆరు నుంచి పది గ్రామాల బాధ్యత
స్టేట్​ వైడ్​ 1,756 మంది టెక్నికల్​ అసిస్టెంట్లు ఉన్నారు.   ఖమ్మం జిల్లాలో 584 గ్రామ పంచాయతీల్లో, 93 మంది టెక్నికల్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. 200 మంది పనిచేయాల్సిన చోట అందులో సగం మంది మాత్రమే ఉండడంతో, ఒక్కో టెక్నికల్ అసిస్టెంట్ కనీసం 6 గ్రామాలకు సంబంధించిన ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాల్సి వస్తోంది. సీతారామయ్య కూడా రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి, చెర్వుకొమ్ముతండా, కామంచికల్, దారేడు, పడమటితండా, రేగుల చెలక గ్రామాలకు టెక్నికల్ అసిస్టెంట్ గా చేస్తున్నారు. గ్రామాల్లో గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో తమపై పని ఒత్తిడి చాలా పెరిగిందని టెక్నికల్ అసిస్టెంట్ లు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో నర్సరీల్లో వర్కర్లు బ్యాగ్ ఫిల్లింగ్ చేయకపోయినా, కూలీలు ఉపాధి హామీ పనులకు రాకపోయినా టీఏలను బాధ్యులుగా చేస్తున్నారని చెబుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ బేసిస్​పై టెక్నికల్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. జాబ్ చార్ట్ ప్రకారం కూలీలకు పనిచేసిన ప్రదేశంలో మార్కింగ్ ఇవ్వడం, చేసిన పనిని మెజర్ మెంట్ బుక్​ లో రికార్డు చేసి పేమెంట్లు జరిగేలా చూడడం, పనులు క్వాలిటీగా ఉండేలా మెయిన్​ టైన్​ చేయడం మాత్రమే తమ బాధ్యతలని, కానీ ఇప్పుడు జాబ్ చార్ట్ లో లేనటువంటి కూలీల మొబిలైజేషన్​, నర్సరీల్లో బ్యాగుల ఫిల్లింగ్, కూలీలతో పని చేయించాల్సిన పనులు కూడా తమతో చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండల స్థాయి అధికారులు ఏవైనా పనులు పెండింగ్ ఉంటే విలేజ్​ సెక్రటరీలను అడగకుండా, మీరేం చేస్తున్నారని తమపై ప్రెజర్​చేస్తున్నారని చెబుతున్నారు. ఒక్కో టెక్నికల్ అసిస్టెంట్ 6 నుంచి 10 గ్రామాల్లో తిరిగి ఎలా పనిచేయించగలమని ప్రశ్నిస్తున్నారు. పని ఒత్తిడిని నిరసిస్తూ బుధవారం డీఆర్డీఏ ఆఫీసు ముందు జిల్లాలోని టెక్నికల్ అసిస్టెంట్లు ధర్నా నిర్వహించారు. 

పని ఒత్తిడితోనే చనిపోయిండు
ఉపాధి హామీ పనులపై రివ్యూకు నాతోపాటు సీతారామయ్యను ఆఫీస్​కు రావాలని ఎంపీడీవో రామకృష్ణ పిలిపించారు. నేను వెళ్లిన 5 నిమిషాల తర్వాత సీతారామయ్య కూడా వచ్చాడు. మండలంలో మీ ఇద్దరి వల్లే పనులన్నీ పెండింగ్ ఉన్నాయని ఎంపీడీవో మా ఇద్దరిపై సీరియస్​అయ్యారు. వారంలోగా పనులన్నీ సెట్ చేయకపోతే మీ ఇద్దరినీ మండలం నుంచి పంపించేస్తా అంటూ గట్టిగా చెప్పారు. ఈలోగా సీతారామయ్య టెన్షన్​పడి తనకు శ్వాస ఆడడం లేదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయారు. - లక్ష్మీనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్

నేనేం ఒత్తిడి చేయలేదు 
మండలంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి వర్క్ లు పెండింగ్ ఉన్నాయని ఏపీవో, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ చెప్పారు. దీనిపై మాట్లాడేందుకు సీతారామయ్యను ఆఫీస్​కు రమ్మని చెప్పాను. నా రూమ్​లో వచ్చి కూర్చున్న 2 నిమిషాలకే, నాతో ఏం మాట్లాడకముందే తనకు అనీజీగా ఉందని చెప్పారు. వెంటనే వెహికల్ తెప్పించి ఆస్పత్రికి పంపించాను. అక్కడి నుంచి హాస్పిటల్​కు తీసుకెళ్లిన కాసేపటికే చనిపోయారని తెలిసింది. వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్​లో సమాచారం ఇచ్చాను. పనిపై ఒత్తిడి చేశానని, తిట్టానని చేస్తున్న ఆరోపణలు తప్పు. కావాలంటే ఆఫీస్​ లో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేసుకోవచ్చు. 
– రామకృష్ణ, ఎంపీడీవో, రఘునాథపాలెం

మల్టీ పర్పస్​ వర్కర్​ను అప్పగించాలి
అదనపు పనులు అప్పగించి మండల స్థాయి అధికారులు మాపై పెత్తనం చెలాయిస్తున్నారు. రోజుకు 50 మంది ఉపాధి హామీ కూలీలను పనికి తీసుకువస్తారా లేదా అని మాకు టార్గెట్ పెడుతున్నారు. ఒక్కో టెక్నికల్ అసిస్టెంట్ కు ఆరేడు గ్రామాల బాధ్యతలు ఇచ్చి, అన్ని పనులు మేమే చూసుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది. ఏపీవో, విలేజ్​ సెక్రటరీలు చేయాల్సిన పనులు కూడా మాకే చెబుతున్నారు. ఈజీఎస్​ పనుల కోసం ఆయా గ్రామాల్లో ఒక మల్టీ పర్పస్​వర్కర్​ను మాకు కేటాయించాలి. 
- సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్ల అసోసియేషన్​