
హైదరాబాద్ నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో మరో ఫ్లైట్ లో ఆయన వెళ్లనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా శనివారం హైదరాబాద్ కు వచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ నుండి అమిత్ షా కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఉదయం 11:40 గంటలకు అమిత్ షా కొచ్చి బయలుదేరాల్సి ఉండగా.. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హైదరాబాద్ లోని NISA లోనే అమిత్ షా ఉన్నారు.
విమాన మరమ్మతులకు సమయం పట్టడంతో అమిత్ షా... విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతీం చేసే విషయమై అమిత్ షాతో పార్టీ నేతలు చర్చించారు. బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన తీరుపై నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారని సమాచారం.