నిమిషాల్లోనే సందేహాలకు సమాధానాలు
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ కాస్పరస్
హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీలు పల్లెటూర్లకు బీమాను చేరువ చేస్తున్నాయని, సులువుగా పాలసీలను కొనేందుకు వీలు కల్పిస్తున్నాయని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ కాస్పరస్ జాకోబస్ తెలిపారు. అయితే ఇప్పటికీ చాలా మందికి బీమా లేదని, ఈ అంతరాన్ని పూడ్చాలని సూచించారు. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ‘ఇండియా..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2026 నాటికి బీమా మార్కెట్ రూ.18.64 కోట్ల చేరుకుంటుందని అంచనా.
జీడీపీలో జీవిత బీమా వాటా 2023లో మూడు శాతం, 2024లో 2.8 శాతం ఉండగా, 2025 నాటికి 2.7 శాతానికి పడిపోయింది. ఇది ప్రపంచ సగటు 7 శాతం కంటే చాలా తక్కువ. 65 శాతం జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం కంటే తక్కువ మందికే జీవిత బీమా ఉంది. అవగాహన, అందుబాటు ధరల సవాళ్లను అధిగమించి ఈ లోటును పూడ్చడానికి ఇన్సూర్టెక్, అల్గారిథమ్స్, ఏఐ, ఏపీఐ టెక్నాలజీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 24 గంటలూ పనిచేసే చాట్బాట్లు వినియోగదారుల సందేహాలను వేగంగా తీరుస్తున్నాయి.
పాలసీల రెన్యువల్ కోసం ఏఐ వాయిస్ బాట్లు, డేటా అనలిటిక్స్ సాయపడుతున్నాయి. మెడికల్ రిపోర్టుల పరిశీలన, ఆర్థిక వివరాలు, రిస్క్ అంచనా, మోసాల గుర్తింపు ప్రక్రియలను ఏఐ సులభతరం చేస్తోంది. పాలసీ జారీ సమయం వారాల నుంచి నిమిషాలకు తగ్గింది. క్లెయిమ్ల పరిష్కారం వేగవంతమైంది. ఏజెంట్ యాప్ల ద్వారా గ్రామీణ, సెమీ అర్బన్ కుటుంబాలకు సరైన పాలసీలను అందించేందుకు ఇవి తోడ్పడుతున్నాయి” అని ఆయన వివరించారు.
