జిన్ పింగ్ తో టెడ్రోస్ ఫోన్ లో ఎప్పుడూ మాట్లాడలేదు

జిన్ పింగ్ తో టెడ్రోస్  ఫోన్ లో ఎప్పుడూ మాట్లాడలేదు
  • జర్మనీ పేపర్ కథనాలను ఖండించిన డబ్ల్యూహెచ్ఓ

జెనీవా : కరోనాను మహమ్మారిగా ప్రకటించేందుకు చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ సూచనల మేరకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ ఆలస్యం చేశారంటూ జర్మనీకి చెందిన ఓ పేపర్ రాసిన కథనాలను డబ్ల్యూహెచ్ఓ ఖండించింది. ఇవన్నీ ఆధారాలు లేని కథనాలని స్పష్టం చేసింది. జిన్ పింగ్ తో జనవరి 21 న టెడ్రోస్ రహస్యంగా ఫోన్ లో మాట్లాడారని ఆయన సూచనల మేరకే ప్రపంచాన్ని అలర్ట్ చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఈ న్యూస్ పేపర్ పేర్కొంది. కరోనాను మహామ్మారిగా ప్రకటించేందుకు మరికొంత కాలం వేచి చూడాలని జిన్ పింగ్ సూచించినట్లు తెలిపింది. వారిద్దరూ మాట్లాడుకున్న ఆడియో టేప్ లు జర్మనీ ఇంటిలిజెన్స్ వద్ద ఉన్నాయని కూడా తెలిపింది. ఇప్పటికే చైనా, డబ్ల్యూహెచ్ఓ లు కరోనా వ్యాప్తి ని నివారించటంలో విఫలమయ్యాయంటూ ఆరోపణలు వస్తున్న సమయంలో ఈ కథనం సంచలనంగా మారింది. దీంతో వెంటనే డబ్య్లూహెచ్ఓ రియాక్ట్ అయ్యింది. అసలు జిన్ పింగ్ తో టెడ్రోస్ ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఆరోపణలు ప్రపంచ దేశాలతో కలిసి డబ్ల్యుహెచ్ఓ చేస్తున్న పోరాటంపై అనుమానాలు కలిగిస్తాయని పేర్కొంది. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందని జనవరి 20న చైనా నుంచి సమాచారం వచ్చిందని ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిపామని చెప్పారు. కరోనా ఎఫెక్ట్ ను అంచనా వేసి ఫిబ్రవరి 11న కరోనా ను మహామ్మారి గాను ప్రకటించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.