- టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
నల్గొండ, వెలుగు: బీసీల ఐక్యతతోనే తెలంగాణలో కొత్త రాజకీయ దిశ ఏర్పడుతుందని, బీసీలే రాజ్యాధికారానికి బలమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. టీఆర్పీ వ్యక్తుల కోసం కాదు, మహనీయుల ఆశయాల సాధన కోసం పుట్టిందన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ, ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ‘ఓపెన్ టాక్ విత్ మల్లన్న’ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులు, మేధావులు, విద్యార్థి నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. టీఆర్పీ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం 20 శాతం బడ్జెట్ కేటాయిస్తామమన్నారు. టీఆర్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యా, వైద్య రంగాలపై 40 శాతం బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ చట్టసభల్లో, ఉద్యోగాల్లో తప్పనిసరి చేస్తామని మల్లన్న తెలిపారు. జానారెడ్డి వంటి అగ్రవర్ణ నాయకులు బీసీ రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రతి ఏడాది బీసీల అభివృద్ధికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి, ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్‌ల మాదిరిగా బీసీ సబ్‌ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వట్టే జానయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, చక్రహరి రామరాజు పాల్గొన్నారు.
