ప్రజాపాలన గ్రామసభ రసాభాస.. రైతులపై తహసీల్దార్​ ఆగ్రహం

ప్రజాపాలన గ్రామసభ రసాభాస.. రైతులపై తహసీల్దార్​ ఆగ్రహం

శివ్వంపేట, వెలుగు :  మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా మారింది.బీఆర్ఎస్ లీడర్ భూములు కబ్జా చేశాడని, తమకు న్యాయం చేయాలంటూ రైతులు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కబ్జాదారులకు మద్దతిస్తున్నారంటూ తహసీల్దార్ పై మండిపడ్డారు. తమ భూములు, కుంటలు, రోడ్లు కబ్జా చేశారని, పదేండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడంలేదన్నారు. ఆఫీసర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పినా రైతులు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా సర్పంచ్​ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో భూసమస్యలు చాలా ఉన్నాయని, అనేక భూములు పార్ట్ -బీ లో పెట్టారని, దీనివల్ల రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు అందడం లేదన్నారు. 

కుంటలకు వెళ్లే దారి కబ్జా చేశారని,  మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. దళితుల భూములు కబ్జా చేశారని, తహసీల్దార్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని పలువురు గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లీడర్ తన పట్టా భూమిలోకి వెళ్లకుండా దారిని కబ్జా చేశాడని విశ్వనాథం అనే వృద్ధుడు ఎమ్మెల్యే సునీతారెడ్డికి చెప్పుకుని బాధ పడ్డాడు. ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడ్డ బీఆర్ఎస్ లీడర్​పై, అతడికి సహకరిస్తున్న తహసీల్దార్ పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 

రైతులపై తహసీల్దార్​ ఆగ్రహం

రైతులు తమ సమస్యలు వివరించేందుకు తహసీల్దార్ శ్రీనివాస్ చారి వద్దకు వెళ్లగా ‘ఇడియట్.. యూస్ లెస్ ఫెలోస్​’ అని తిట్టడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ లీడర్​ కరుణాకర్ రెడ్డి తహసీల్దార్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతులను నోటికి వచ్చినట్టు తిడతారా?  మీపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా’ అని హెచ్చరించారు.