Mirai Movie: తేజ సజ్జ 'మిరాయ్'లో 'రెబల్ స్టార్' ప్రభాస్.. క్యారెక్టర్ ఇదే!

Mirai Movie: తేజ సజ్జ 'మిరాయ్'లో 'రెబల్ స్టార్' ప్రభాస్..  క్యారెక్టర్ ఇదే!

'హనుమాన్' సినిమాతో ఫుల్ క్రేజ్ ను కొట్టేసిన టాలీవుడ్ యువనటుడు తేజ సజ్జ మరో సారి 'మిరాయ్' తో జాక్ పాట్ కొట్టేందుకు రెడీ అయ్యారు.  ఈ చిత్రం రోజు ( సెప్టెంబర్ 12న ) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన  ట్రైలర్స్, పాటలు భారీ అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించారంటూ ఎన్నో ఊహగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన ఈ మూవీలో ఒక కీలక పాత్రలో కనించారని వెల్లడైంది. 

ప్రభాస్ వాయిస్‌తో ప్రారంభం.. 

ఈ సినిమా విడుదలకు ముందు .. తేజ సజ్జ ' మిరాయ్ ' ఒక 'రెబెల్యస్ సర్పైజ్' ఉందని పరోక్షంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తున్నారనే ఊహగానాలు ఇంటర్ నెట్ లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ ఆయన పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ ఫాంటసీ యాక్షన్ ఎడ్వెంచర్ సినిమా ప్రారంభంలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతే కాకుండా .. ఆయన శ్రీరాముడి పాత్రలో కూడా తెరపై కనిపించారు. అయితే పూర్తిగా ముఖం కనిపించేలా కాకుండా ఒక ప్రత్యేకమైన షాట్ లో  మాత్రమే దర్శనమిచ్చారు. అదికూడా సగం ముఖం కనిపించేలా షాట్ ఉంది. దీనిని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

 

మళ్లీ గెస్ట్ రోల్‌లో..

రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్స్ లో కనిపించడం ఇది తొలిసారి కాదు. ఇటీవల విడులైన మంచు విష్ణు మూవీ 'కన్నప్ప'లో  కూడా రుద్ర పాత్రలో కనిపించి మెప్పించారు.  ఇప్పుడు 'మిరాయ్' కు కూడా ప్రభాస్ సహకారం లభించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఇది ఒక రకంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను గణనీయంగా పెంచి .. భారీ విజయానికి దోహదపడుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

కథా నేపథ్యం

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన కథాంశం ఆసక్తికరంగా ఉంది.  పాన్-ఇండియా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఈ చిత్రం క్రీ.పూ 250లో చక్రవర్తి అశోకుని కాలంలో సృష్టించబడిన తొమ్మిది పురాతన గ్రంథాల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రంథాలకు సామాన్య మానవులను శక్తివంతమైన దేవతలుగా మార్చే అద్భుతమైన సామర్థ్యం ఉంది. ఈ కథలో, ఒక యువకుడు ( తేజ సజ్జ)  తాను ఒక అసాధారణమైన మంత్రదండం ద్వారా మానవజాతి విధిని మార్చగల శక్తివంతుడిగా గ్రహిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి విలన్‌గా మంచు మనోజ్ తోడయ్యారు. హీరోయిన్‌గా రితికా నాయక్ నటించారు.  సీనియర్ నటి శ్రియా శరణ్ కీలక పాత్రలో నటించారు.. 

ఈ చిత్రానికి హరి గౌర సంగీతం అందించారు. సూపర్ యోధగా తేజా సజ్జా పాత్ర సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అని నిలుస్తోంది. ఆయనకు ఇది రెండో పాన్ ఇండియా సినిమా కాగా, ఇందులోని క్యారెక్టర్ ని ఆడియన్స్ ఎప్పటికీ మరచిపోలేరని  ప్రేక్షకులు అంటున్నారు. ఫస్టాఫ్, సెకండాఫ్ అనే తేడా లేకుండా సినిమా మొత్తం ఓ ఫ్లోలో సాగిపోతూ ఎక్కడా బోర్ కొట్టించలేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.