
- మేడిగడ్డ కుంగిన ఘటనలో క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న విజిలెన్స్ రిపోర్ట్
- మంత్రులతో సమావేశంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులపై సీఎం చర్చ
- తాజాగా ఈఎన్సీ జనరల్‌తో ఇరిగేషన్ సెక్రటరీ భేటీ
- కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రమాదంపై పీపీటీలు తయారు చేయాలని సూచన
- 5న కేబినెట్ మీటింగ్‌లో వీటిపై చర్చించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మంది కీలక అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సర్కారు తర్జనభర్జన పడుతున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 40 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ డిపార్ట్మెంట్ మార్చిలో రిపోర్ట్ ఇచ్చింది. అందులో 17 మంది రిటైర్డ్, ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మరో 23 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది.
ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకోవాలా? వద్దా?..తీసుకుంటే ఎలా చర్యలు తీసుకోవాలి? అన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైనా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. ఆయా అంశాలపై ఆదివారం మంత్రులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు సమాచారం. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టుల్లోని అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది.
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరికొంత కాలం వేచి చూడాలా? లేదంటే పునరుద్ధరణ పనులపై ముందుకెళ్లాలా? అన్న యోచనలో పడినట్టు తెలుస్తున్నది. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మార్చిలో ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషనర్ సమర్పించిన రిపోర్టు తాజాగా సర్క్యులేట్ అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తున్నది.
కేసీఆర్‌ను విచారించేంత వరకు ఆగుదామా?
ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే.. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తయి రిపోర్ట్ వచ్చే వరకు ఆగుదామా? అనే అంశంపైనా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎదుట ఈ నెల 6న ఈటల, 9న హరీశ్ రావు, 11న కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు.
కమిషన్‌కు వారు ఏం చెప్తారన్నది ఆసక్తిగా మారింది. వారి స్టేట్మెంట్లను చేర్చి ప్రభుత్వానికి కమిషన్ రిపోర్టును సమర్పించనుంది. ఈ క్రమంలోనే రిపోర్టు వచ్చే వరకు వేచి చూస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తే డిపార్ట్మెంట్ వీక్అయ్యే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ రిపోర్టులో పేర్కొన్న వారిలో చాలా వరకు సీఈలు, ఎస్ఈల స్థాయి అధికారులే ఉండడంతో.. ప్రభుత్వం అంతర్మథనం పడుతున్నదని తెలుస్తున్నది.
సెక్రటరీ, ఈఎన్సీ భేటీ..
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి ఈఎన్సీ జనరల్ అనిల్‌తో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం సెక్రటేరియెట్‌లో ఆయన భేటీ అయ్యారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులపై చర్చించినట్టు తెలిసింది. ఆ రిపోర్టుల్లోని అంశాల ఆధారంగా ఏం చేయాలన్న దానిపై చర్చలు జరిపినట్టు సమాచారం.
ఈ నెల 5న నిర్వహించనున్న కేబినెట్ మీటింగ్‌లో కాళేశ్వరం అంశంపై ప్రత్యేకంగా చర్చకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో.. దానికి సంబంధించి పీపీటీలను తయారు చేయాలని ఈఎన్సీకి సెక్రటరీ సూచించినట్టు తెలిసింది. కాగా, కేబినెట్లో నాలుగైదు ప్రాజెక్టులకు సంబంధించిన పనుల ఎస్టిమేట్స్పైనా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.