- రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 80 గ్రామాలు ఎంపిక
- ఇప్పటివరకు 45 శాతం పనులు పూర్తి
హనుమకొండ, వెలుగు: సోలార్ రూఫ్ టాప్స్ ద్వారా విద్యుత్ వినియోగదారులు, రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఇంటితో పాటు వ్యవసాయ పంప్‌సెట్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా, మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 80 గ్రామాలను ‘మోడల్ సోలార్ విలేజ్’ పేరుతో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. గత ఏడాది ప్రారంభమైన పనులు కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుండటంతో ప్రభుత్వం మార్చి 31లోగా అన్ని ఇన్‌స్టాలేషన్ పనులు పూర్తి చేయాలని గడువు
విధించింది.
వంద శాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్..
గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎంపికైన గ్రామాల్లో ప్రతి ఇంటిపై దాదాపు రూ.1.38 లక్షల వ్యయంతో 2 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఖర్చులో రూ.60 వేలు కేంద్రం, రూ.78 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఈ పనులను తెలంగాణ స్టేట్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్ఈడీసీవో), డిస్కంల ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. వ్యవసాయ పంప్‌సెట్లకు 7.5 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
పైలట్ ప్రాజెక్ట్‌లో 80 గ్రామాలు..
మోడల్ సోలార్ విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 80 గ్రామాలు ఎంపికయ్యాయి. తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్) పరిధిలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని 22 గ్రామాలు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, హనుమకొండ, ములుగు, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోని పలు గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో కొడంగల్ మండలంలోని 34 గ్రామాలతో పాటు మరో 9 గ్రామాలు ఎంపికయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో వంద శాతం పనులు పూర్తయ్యాయి.
40 వేలకు పైగా ఇళ్లలో ఇన్‌స్టాలేషన్..
పైలట్ గ్రామాల్లో మొత్తం 40,349 గృహాలకు 2 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్, 16,805 వ్యవసాయ పంప్‌సెట్లకు సోలార్ సిస్టమ్స్ అమర్చుతున్నారు. ఇప్పటివరకు సుమారు 45 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇన్‌స్టాలేషన్ అనంతరం నెట్ మీటరింగ్ సిస్టమ్ అమర్చి గృహ అవసరాలకు వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్ గ్రిడ్‌కు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. వంద శాతం సబ్సిడీతో పాటు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.
గడువులోగా పూర్తి చేస్తాం
మోడల్ సోలార్ విలేజ్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గ్రామాల్లో పనులను వేగవంతం చేశాం. ప్రజల్లో అవగాహన పెరుగుతున్నందున ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను స్పీడప్ చేశాం. నిర్దిష్ట గడువులోగా అన్ని పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం.- మహేందర్ రెడ్డి, టీజీ రెడ్కో డీఎం, వరంగల్
