జనవరి 2న ఒక్కరోజే 20 లక్షల ప్రజాపాలన అప్లికేషన్లు

జనవరి 2న ఒక్కరోజే 20 లక్షల ప్రజాపాలన అప్లికేషన్లు

తెలంగాణ వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులకు భారీ రెస్పాన్స్ వస్తోంది. నాలుగోవ రోజు (జనవరి 2న) అభయహస్తంకు భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల39 వేల 27 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అభయ హస్తం పథకాల కింద 17 లక్షల 39 వేల 146 దరఖాస్తులు రాగా మిగిలినవి ఇతర దరఖాస్తులు. డిసెంబర్ 28న ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తులకు  మొత్తం నాలుగు రోజుల్లో( ఆదివారం, సోమవారం సెలవు) 61 లక్ష 16 వేల167 దరఖాస్తులు వచ్చాయి.  జనవరి 2న 1866 మున్సిపల్ వార్డుల, 3779 గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. 

ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలన దరఖాస్తులకు జనవరి 2వ తేదిన  3 లక్షలల 62 వేల 606 దరఖాస్తులు వచ్చినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 4 రోజుల్లో మొత్తం హైదరాబాద్ లో 13లక్షల 54 వేల 817 దరఖాస్తులు వచ్చాయి. 

డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు 

ప్రజా పాలన దరఖాస్తుల సమాచారాన్ని బిగ్ డేటాబేస్ కింద డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుని ఆ తరువాత వాటన్నింటిని కంప్యూటరైజ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్​వేర్​ను ప్రభుత్వం రెడీ చేయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు, అందులో అర్హుల వివరాలతో పాటు ప్రతి కుటుంబానికి చెందిన సమగ్ర సమాచారం ఉండనుంది. గ్రామం యూనిట్​గా ఒక్క క్లిక్​తో రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ గ్యారంటీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు? వారి అర్హత ఏమిటి? ఎంతమందికి లబ్ధి చేకురుతుంది? అనే వివరాలు తెలుసుకునేలా సాఫ్ట్ వేర్​ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.