ఫుల్లుగా నీళ్లుండే పెన్నాకు కృష్ణానుంచి ఎలా తీసుకెళ్తారు?

ఫుల్లుగా నీళ్లుండే పెన్నాకు కృష్ణానుంచి ఎలా తీసుకెళ్తారు?
  • మేం కరువుతో అల్లాడుతుంటే ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్నది 
  • బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ వాదనలు
  • జీబీ లింక్​ పేరిట పెన్నాకూ నీటిని తన్నుకుపోయేలా ఏపీ కుట్రలు
  • ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు వందల కోట్ల ఖర్చు
  • పెన్నా బేసిన్​లోనే 344 టీఎంసీల నీటి లభ్యత  
  • కానీ, కృష్ణా నుంచే ఏటా 330 టీఎంసీలు ఏపీ తీసుకెళ్తున్నది
  • ఇన్​సైడ్​ బేసిన్​కు ఒక్క చుక్క కూడా తీసుకెళ్లట్లే

హైదరాబాద్, వెలుగు: ఓవైపు తెలంగాణ కరువుతో అల్లాడుతుంటే.. ఏపీ మాత్రం కృష్ణా నుంచి ఔట్​సైడ్​ బేసిన్​కు నీళ్లను తన్నుకుపోతున్నదని ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ వాదించింది. ఇన్​సైడ్​ బేసిన్​కే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా.. ఔట్​సైడ్​ బేసిన్​లోని పెన్నా బేసిన్​కు ఏపీ కృష్ణా నీళ్లను దోచుకెళ్లిపోతున్నదని ఆక్షేపించింది. ఇప్పటికే కృష్ణా నీళ్లను తరలిస్తున్న ఏపీ.. ఇప్పుడు గోదావరి బనకచర్ల (జీబీ) లింక్​ పేరిట పోలవరం నుంచి కూడా పెన్నా బేసిన్​కు నీటిని తరలించేందుకు కుట్రలు చేస్తున్నదని తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఏపీ వందల కోట్లు ఖర్చు చేసిందని, బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్​ను నిర్మించి పెన్నాకు నీటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నది. 

దీనిపై కేడబ్ల్యూడీటీ –2లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపింది. సోమవారం బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​ (కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ –2) ముందు తెలంగాణ తరఫున సీనియర్​ అడ్వకేట్​ సి.ఎస్​. వైద్యనాథన్​ వాదనలు వినిపించారు. కృష్ణా బేసిన్​లో ఉన్న తెలంగాణ ఓవైపు కరువుతో అల్లాడుతుంటే.. నీళ్లు దండిగా ఉన్న పెన్నా బేసిన్​కు ఏపీ నీళ్లు తరలించుకుపోవడమేంటని ప్రశ్నించారు. ఏపీకి 40 రివర్​ బేసిన్లు ఉన్నాయని, వాటితో ఆ రాష్ట్రానికి పుష్కలంగా నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. కానీ, నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణా బేసిన్​ నుంచి.. నీటి లభ్యత మంచిగా ఉండే పెన్నాబేసిన్​కు ఏటా 330 టీఎంసీలను తన్నుకుపోతున్నదని వాదించారు. 

కృష్ణా నీళ్లు కాకుండా పెన్నా బేసిన్​లో 344 టీఎంసీల నీటి లభ్యత ఉందని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా 360 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను ఏపీ నిర్మించుకున్నదని ట్రిబ్యునల్​కు వివరించారు. ఏపీ అడ్డదారిలో నీటిని తరలించుకుపోతుండడంతో పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.  

మళ్లీ కొత్తగా కేటాయింపులు చేయాల్సిందే..

సెక్షన్​ –3లోని ఫర్దర్​ టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ను ట్రిబ్యునల్​కు తెలంగాణ వివరించింది. ఏపీ, తెలంగాణల మధ్య ప్రత్యేకంగా కేటాయింపులేవీ లేవని, రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను చేసే బాధ్యత ట్రిబ్యునల్​కే కేంద్రం అప్పగించిందని గుర్తు చేసింది. అందుకు తగ్గట్టుగానే తొలుత కేడబ్ల్యూడీటీ– 1, ఆ తర్వాత కేడబ్ల్యూడీటీ– 2 రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులను చేసిందని తెలిపింది. అయితే, 2 రాష్ట్రాల మధ్య అంతర్గతంగా జరిగిన ఒప్పందాల మేరకు నీటి కేటాయింపులను కొనసాగించాలంటూ ఏపీ అడుగుతున్నదని పేర్కొన్నది. అలా జరిగితే తమకు నష్టం జరుగుతుందని ట్రిబ్యునల్​కు వివరించింది.

 మళ్లీ మొదటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. జాతీయ, అంతర్జాతీయ క్రైటీరియా ప్రకారం నీటి కేటాయింపులు జరగాలని తెలిపింది. మరోవైపు తెలంగాణలో ప్రతిరోజూ తలసరి నీటి లభ్యత 422 క్యూబిక్​ మీటర్లుండగా.. ఏపీ, తెలంగాణ తలసరి నీటి వాడకం అంతకన్నా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణ తరఫున సీఎస్​ వైద్యనాథన్​తో పాటు ఇతర అడ్వకేట్లు, ఇంటర్​స్టేట్​ డిస్ప్యూట్స్​ అధికారులు వాదనల్లో పాల్గొనగా.. ఏపీ నుంచి సీనియర్​ అడ్వకేట్​ జయదీప్​ గుప్తా, ఆ రాష్ట్ర ఇంటర్​స్టేట్​ డిస్ప్యూట్స్​ అధికారులు పాల్గొన్నారు.

ఇన్​సైడ్​ బేసిన్​కు వద్దంట 

కృష్ణా నది నుంచి ఏపీ ఇన్​సైడ్​ బేసిన్​కు నీటిని అడగడం లేదని, ఒక్క చుక్క కూడా పరివాహక ప్రాంతంలో వాడుకోవడం లేదని తెలంగాణ వాదించింది. ఇప్పుడు ఏపీ అడుగుతున్నదంతా ఔట్​సైడ్​ బేసిన్​లో ఉన్న పెన్నా బేసిన్​కు తీసుకెళ్లేందుకేనని ట్రిబ్యునల్​దృష్టికి తెచ్చింది. అయితే, తాము మాత్రం న్యాయంగా తమకు రావాల్సిన వాటాలో ఇన్​సైడ్​ బేసిన్​కే తీసుకెళ్తున్నామని పేర్కొన్నది. కొత్త ఆయకట్టులోని తడి భూములకు కాకుండా.. నీళ్లు లేకుండా పంటలు ఎండుతున్న కరువు, బీడు భూములకే నీళ్లు ఇవ్వాలంటున్నామని తెలిపింది. కాగా, పరివాహకప్రాంతంలోని జనాభా, ఆయకట్టు ఆధారంగానే నీటి పంపకాలు జరగాలని తెలంగాణ వాదించింది. ఈ లెక్కలపై ట్రిబ్యునల్​ కొన్ని డౌట్లు అడగడంతో అడ్వకేట్​​ వాటిని క్లారిఫై చేశారు.