దుర్గంధంగా కాలనీలు.. ఆవేదనలో బాధిత కుటుంబాలు

దుర్గంధంగా కాలనీలు.. ఆవేదనలో బాధిత కుటుంబాలు

భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం నీటిమట్టం 54.3 అడుగులుగా ఉంది. వరద ప్రవాహం తగ్గుతుండటంతో లోతట్టు ప్రాంతాల జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే రామాలయం దగ్గర బ్యాక్ వాటర్ రావడంతో ఆ ఏరియాలో ఇంకా వరద నీళ్లు ఉన్నాయి. వాటిని హెవీ మోటార్ల ద్వారా గోదావరిలోకి పంపుతున్నారు. రామాలయ పరిసరాలైన ముదిరాజ్ బజార్, సుభాష్ నగర్, ఆదర్శ నగర్ కాలనీ, అయ్యప్ప కాలనీ తదితర కాలనీలు నీటమునిగాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. వరదల్లో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటితో పాటు చెత్తా చెదారం కొట్టుకురావడంతో కాలనీల్లో దుర్గంధం వస్తోంది. జనం ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కరట్ట ఎత్తు పెంచడంతో పాటు మరో 5 కిలోమీటర్ల దాకా దాన్ని విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. 

భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి దెబ్బతింది. వరద నీటికి ఉద్ధృతికి ఇనుప రాడ్లు బయటకు తేలాయి. రెండు జిల్లాలకు మధ్య ఉన్న ఈ వంతెనపై  రోజూ వందల వాహనాలు వెళ్తుంటాయి. వర్షాలకు దెబ్బతిన్న ఈ రోడ్డును ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

ఇక నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని సాలాపుర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరద నీళ్లతో నిండిపోయింది. గ్రామంలో వారం రోజులుగా కురిసిన భారీ వర్షానికి సర్కార్ బడిలో వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. అదిఇప్పటికీ అలాగే ఉంది. స్కూళ్లు మొదలవడంతో మట్టి, బురదనీళ్లను స్థానికులు బకెట్లతో బయటకు ఎత్తిపోసినా ఫలితం లేకుండా పోయింది.

ఇటీవల కురిసిన వర్షాలకు మహబూబాబాద్ ఆర్టీసి బస్టాండ్ అధ్వాన్నంగా తయారైంది. బస్టాండ్ లో ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోంది. బస్టాండ్ లో ప్రయాణీకులు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో బురదలోనే నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ బస్టాండ్ దుస్థితి చూసి అభివృధ్ధికి రూ. 35 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.