కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ పాత పాటే పాడిన్రు

కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ పాత పాటే పాడిన్రు
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులు పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు ఏ మాత్రం మారలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలు భాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ రాష్ట్రాలపైనే నెడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంటులోని కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్ ఛాంబర్‎లో తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావుల బృందం భేటీ అయింది. ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాత పాటే పాడారని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్రం బాధ్యతను రాష్ట్రాలపైకి నెడుతున్నారని, రాష్ట్రమే వడ్లు కొనుగోలు చేయాలంటే ఎలా సాధ్యమని, రాష్ట్రాలకు స్టోరేజీ కోసం ఏం వ్యవస్థ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కేంద్రానిది వ్యాపార కోణం

కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజం అనే మాటకు అర్థం లేకుండా చేస్తోందని, పదేండ్ల క్రితం మోడీ మాట్లాడిన మాటలకు ఈ రోజు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం ఇతర పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసిందని మోడీ ఆరోపించారని, ఈ రోజు మోడీ సర్కారు కూడా ఎన్డీయే మిత్రపక్షాలు కాని ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని అన్నారు. కేంద్రం తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే అని, రైతుల నుంచి వడ్లు తీసుకుని మిల్లర్లతో కేంద్రమే బియ్యం పట్టించుకోవాలని ఆయన అన్నారు. కానీ రాష్ట్రాలే వడ్లు కొని కేంద్రానికి బియ్యం ఇవ్వాలని పీయూష్ గోయల్ చెప్పడం విడ్డూరంగా ఉందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మార్కెట్ లో అమ్ముడుపోయే ధాన్యమే కొంటామని కేంద్రం చెబుతోందని, ఇదేం నీతి అని ప్రశ్నించారు. కేంద్ర సర్కారులో వ్యాపార కోణం తప్ప రైతు సంక్షేమ కోణం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే రోజు వస్తది

తెలంగాణ రైతాంగాన్ని ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించారని నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చేదే బాయిల్డ్ రైస్ అంటే ఎంతసేపు ఆయన రా రైస్ ఎంతిస్తారో చెప్పాలని అంటారే తప్ప మరో మాట మాట్లాడం లేదని అన్నారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో పండే ధాన్యంలో నూక ఎక్కువగా వస్తుందని అన్నారు. కేంద్రం మంత్రి చెప్పిందే చెప్పి.. మన రాష్ట్ర రైతులను అవమానించేలా మాట్లాడారని అన్నారు. అయితే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని బీజేపీని ఆయన హెచ్చరించారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ సర్కారు.. ఇయ్యాల కనీసం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని స్థితిలో ఉందన్నారు. చిన్న సన్నకారు రైతులకు పెన్షన్ ఇస్తామని చెప్పారని, కానీ ఆ హామీని నేటికీ అమలు చేయలేదని అన్నారు. అగ్రి చట్టాలను తెచ్చి రైతుల నిరసనలతో వాటిని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

దమ్ముంటే ఎన్నికలు పెట్టండి.. బీజేపీకి సీఎం సవాల్

ఇంటి పన్ను కట్టలేదని ఇంటి ముందు చెత్త పోసిన్రు