
- విభజన సమస్యలపై తెలంగాణ, ఏపీ మంత్రులు ఉత్తమ్, నాదేండ్ల సమావేశం
- పోర్టుల ద్వారా విదేశీ ఎగుమతులకు సహకరించుకోవాలని నిర్ణయం
- ఏపీ ఆధీనంలో ఉన్న బీ బ్లాక్ తెలంగాణకు ఇచ్చేందుకు అంగీకారం
హైదరాబాద్, వెలుగు: పౌర సరఫరాల శాఖ పరిధిలో పరస్పరం సహకరించుకోవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లయ్స్భవన్లో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏపీ మంత్రి నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్సమస్యల పరిష్కారం దిశగా కీలక చర్చలు జరిపారు. సివిల్ సప్లైస్ ఆస్తుల బదిలీ, ఏపీలోని ఓడరేవు ద్వారా ఉమ్మడి ఎగుమతి కార్యకలాపాలు, బియ్యం సేకరణ, పంపిణీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహణ వంటి కార్యక్రమాలు ఉమ్మడి భాగస్వామ్య విధానంతో చేపట్టాలని నిర్ణయించారు.
చర్చల్లో భాగంగా వచ్చే జూన్1 నుంచి హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని సివిల్ సప్లయ్స్ భవన్లో గల బీ బ్లాక్‌లో ఉన్న ఏపీ సివిల్ సప్లయ్స్ ఆఫీసును తెలంగాణ పౌర సరఫరాలశాఖ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంగీకారం కుదిరింది. దీంతో పాటు ఏపీ గోదాములను కూడా తెలంగాణ వాడుకోనుంది. ఏపీ కాకినాడ ఓడరేవు ద్వారా ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతికి ఎలాంటి షరతులు లేకుండా ఏపీ ఒకే చెప్పింది. ఈ ఉమ్మడి సహకార కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల మంత్రులు నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణ సివిల్ సప్లయ్స్ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ డీఎస్ చౌహాన్, ఏపీ సివిల్ సప్లయ్స్ కమిషనర్ సౌరభ్ గౌర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
సప్లయ్ చైన్ ఏర్పాటు చేస్తున్నం: మంత్రి ఉత్తమ్
మీటింగ్ అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాంకేతిక సహకారం, ఏపీ సరుకు రవాణా సామర్థ్యాలతో రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా సప్లయ్ చైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ సహకారంతో ఇప్పటికే బియ్యం అక్రమ రవాణాను అరికడ్తున్నామని, విదేశాలకు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతిచేయడంలోనూ మరింత పురోగతి సాధిస్తామన్నారు. “ఈ సహకారం కాగితాలకే పరిమితం కాదు.
ఇది పరస్పర విశ్వాసం, ఉమ్మడి లక్ష్యంతో ప్రజల కోసం చేపట్టిన చొరవ” అని ఉత్తమ్ పేర్కొన్నారు. ఏపీ మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సహకారం ఆధునిక పాలనకు ఒక మోడల్ అని పేర్కొన్నారు. ఇది రాష్ట్రాల మధ్య పోటీ కాదని, సహకారమే భవిష్యత్తు అని ఆయన స్పష్టం చేశారు.