
‘నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది’ అన్న సామెత పెట్టుబడులకు అంతర్జాతీయ గమ్యస్థానంగా మారిన తెలంగాణ విషయంలోనూ నిత్యం వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో ఇతర రాష్ట్రాలకు దీటుగా 18 నెలల కాలంలోనే రూ.3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించగలిగింది. ‘పరిశ్రమలు తరలిపోతున్నాయి... పెట్టుబడులు రావడం లేదు’ అంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారానికి దీటుగా సమాధానమిస్తూ... దేశ ఆర్థికపటంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని తెలంగాణ సంపాదించుకుంది.
పారిశ్రామికంగా ముందుండే రాష్ట్రాల కంటే..
2024-–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ పారిశ్రామిక రంగం 7.6 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఇది జాతీయ సగటు 6.6 శాతం కంటే ఎక్కువ. మొత్తం స్థూల రాష్ట్ర విలువ జోడింపు(జీఎస్ వీఏ)లో పారిశ్రామిక రంగం వాటా రూ.2.77 లక్షల కోట్లుగా నమోదయ్యింది. దీని వార్షిక వృద్ధి రేటు 8.68 శాతం.
డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్ డీఐ ఇన్ ఫ్లోస్, తెలంగాణ సోషియా ఎకనమిక్ అవుట్‌లుక్ – 2025 నివేదికలను పరిశీలిస్తే పెట్టుబడుల విషయంలో తెలంగాణ పారిశ్రామికరంగంలో ముందుండే పలు రాష్ట్రాలను వెనక్కి నెట్టేసినట్లుగా స్పష్టమవుతోంది.
ఈ 18 నెలల కాలంలో గుజరాత్ కు రూ.2.6 లక్షల కోట్లు, తమిళనాడుకు రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణ మాత్రం రూ.3.2 లక్షల కోట్లకు పైగా ఆకర్షించగలిగింది. ఇది కేవలం ఒక నంబర్ కాదు... తెలంగాణపై జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనం.
ఏ రంగం.. ఏ కంపెనీ.. ఎంతెంత?
హైపర్ స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ.60వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ - పంప్డ్ స్టోరేజ్, సోలార్ రంగంలో సన్ పెట్రో కెమికల్ రూ.45,500 కోట్లు, మూడు డేటా సెంటర్ల కోసం మైక్రోసాఫ్ట్ రూ.16వేల కోట్లు, డేటా సెంటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం టిల్ మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15వేల కోట్లు, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, వెల్ నెస్ రంగంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా రూ.15వేల కోట్లు, రెన్యూవబుల్ ఎనర్జీ, డేటా సెంటర్, సిమెంట్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో అదానీ గ్రూప్ రూ.12,400 కోట్లు, ఏఐ-పవర్డ్ డేటా సెంటర్ క్లస్టర్ కోసం కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ రూ.10వేల కోట్లు, లిథియం అయాన్/సోడియం అయాన్ సెల్ మాన్యుఫాక్చరింగ్ కు గోది ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.8వేల కోట్లు, డేటా సెంటర్స్ కు వెబ్ వెర్క్స్ రూ.5,200 కోట్లు, ఆటో కాంపోనెంట్స్ లో హ్యూందాయి – మోబిస్ రూ.3వేల కోట్లు, ఆర్ అండ్ డీ రంగంలో మెడ్ ట్రానిక్ రూ.3వేల కోట్లు, బయో టెక్, ఏఐ, డేటా సెంటర్స్, ఫిన్ టెక్, డిఫెన్స్ లో యూఏఐ కంపెనీలు శైవా గ్రూప్, టారానిస్ క్యాపిటల్ రూ.2,125 కోట్లు, టెక్నికల్ టెక్స్ టైల్స్ లో వెల్ స్పన్ రూ.2వేల కోట్లు, ఈవీ మాన్యుఫాక్చరింగ్ లో మహీంద్రా అండ్ మహీంద్రా రూ.వేయి కోట్లు, గ్రీన్ ఎయిర్ కండీషనింగ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు డైకిన్ ఎయిర్ కండిషనింగ్ రూ.వేయి కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ కాంపోనెంట్స్ లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ రూ.900 కోట్లు, యూఏవీ/డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ లో జేఎస్ డబ్య్లూ డిఫెన్స్ రూ.800 కోట్లు, ప్రైవేట్ రాకెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు స్కైరూట్ ఏరోస్పేస్ రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఎందుకు తెలంగాణ అనుకూలం
పటిష్టమైన మౌలిక సదుపాయాలు (ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, రోడ్డు నెట్వర్క్, ఆర్ఆర్ఆర్, మెట్రో రైల్, సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్. 15 రోజుల్లోనే అనుమతులిచ్చే సింగిల్ విండో సిస్టం(టీజీ – ఐపాస్), టాలెంట్ పూల్, స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు(యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, టాస్క్, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ), నిపుణులు, స్టేక్ హోల్డర్స్ భాగస్వామ్యంతో విధానాల రూపకల్పన, ఆవిష్కరణలకు పెద్దపీట
(టీ – హబ్, టీ-వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సర్కిల్, వీ –హబ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్), భవిష్యత్తు అభివృద్ధి ప్రాజెక్టులు(ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మా విలేజెస్, మెట్రో ఫేజ్ – 2, కొత్త విమానాశ్రయాలు) తదితర అంశాలు తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చుతున్నాయి.
ఇతర ప్రాంతాలకూ ఆకర్షించేలా...
సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో అడుగులు వేస్తోంది. ‘తెలంగాణ రైజింగ్ – 2047’ కింద రాష్ట్రాన్ని అర్బన్, సెమీ – అర్బన్, రూరల్ జోన్లుగా విభజించింది. ఈ మూడు జోన్లలో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా 70వేల ఎకరాల ‘రెడీ టూ ఆక్యుపై’ ల్యాండ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేస్తోంది. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఈవీలు, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్ తదితర రంగాల పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోనుంది. ఈ గణాంకాలు, పెట్టుబడులు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. తెలంగాణ సాధించిన పెట్టుబడుల ప్రగతే ప్రత్యక్ష నిదర్శనం.
ఎఫ్డీఐల ఆకర్షణలోనూ అగ్రగామి
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలోనూ తెలంగాణ ముందంజలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. 2023–24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. డేటా సెంటర్లు, ఈవీలు, యానిమేషన్/గేమింగ్, ఆర్ అండ్ డీ, ఏఐ తదితర రంగాల్లో ఈ పెట్టుబడులొచ్చాయి.
- పి. భానుచందర్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి పీఆర్వో-